Modi Comments on KCR in Hanamkonda Public Meeting : హనుమకొండ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. భద్రకాళి, సమ్మక్క, సారలమ్మ, రుద్రమను తెలుగులో ప్రధాని మోదీ స్మరించుకున్నారు. సమ్మక్క-సారలమ్మ పౌరుషానికి ప్రతీకలని కొనియాడారు. రాణి రుద్రమ పరాక్రమానికి చిరునామా అయిన వరంగల్‌కు రావడం సంతోషకరంగా ఉందని చెప్పారు. మున్సిపల్ సంస్థ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్ చూపించిందని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పత్తా లేకుండా చేస్తామని పునురుద్ఘాటించారు. బీజేపీ తొలిసారి సాధించిన 2 ఎంపీ సీట్లలో ఒకటి హనుమకొండని మోదీ గుర్తు చేశారు.
దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారిందని మోదీ తెలిపారు. ఆత్మనిర్భర భారత్‌లోనూ రాష్ట్రానిది ప్రధాన భూమిక అని చెప్పారు. వ్యాక్సీన్ల తయారీలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణకు ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయని.. తద్వారా ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయని వివరించారు. కేంద్రం ఇన్ని చేస్తుంటే.. మరి రాష్ట్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందని మోదీ విమర్శించారు.
Modi Comments on KCR :బీఆర్ఎస్ సర్కార్..అత్యంత అవినీతి ప్రభుత్వం అని మోదీ దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కారు అవినీతి దిల్లీ వరకూ పాకిందని తెలిపారు. అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలసి పని చేస్తుంటాయని చెప్పారు. తొలిసారిగా అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేయడం దౌర్భాగ్యమని ఆరోపించారు. ఇలాంటి అవినీతి చూసేందుకేనా.. యువత ఆత్మబలిదానాలు చేసిందని మోదీ ప్రశ్నించారు.
Modi Fires on BRS Govt : కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ సర్కారు పని అని మోదీ దుయ్యబట్టారు. ఇలాంటి కుటుంబ పాలనలో రాష్ట్రం చిక్కుకుంటుందని ప్రజలు అనుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ అవినీతి పాలనను దేశమంతా చూసిందని వివరించారు. ముఖ్యమంత్రి అవినీతి పాలనను తెలంగాణ చూసిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిందని.. యువతను మోసం చేశారని మోదీ ధ్వజమెత్తారు.