కేంద్ర మంత్రివర్గ విస్తరణకు విస్తృత స్థాయిలో కసరత్తు జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలతో రెండు సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో...... త్వరలోనే విస్తరణ ఉంటుందనే
ప్రచారం ఊపందుకుంది. కేంద్ర మంత్రులు లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాసవాన్, కర్ణాటక భాజపా నాయకుడు సురేష్ అంగడి మరణంతో కేబినెట్ విస్తరణకు అవకాశం ఏర్పడింది. NDA భాగస్వామ్య పక్షాలు శిరోమణి అకాలీదళ్, శివసేన నాయకులు ఖాళీ చేసిన రెండు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది.
కేంద్రమంత్రి వర్గంలోని పలు శాఖలు...అదనపు బాధ్యతలను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో... వీటిని కొత్త వారికి అప్పగించి కేబినెట్ హోదా కల్పించాలని భాజపా అగ్రనాయకత్వం యోచిస్తోంది. పరిశ్రమలు, వాణిజ్యం, న్యాయ, వ్యవసాయం, విద్యాశాఖ, పౌర విమానయానం, ఆహార శుద్ధి వంటి శాఖల్లో మార్పులు ఉండొచ్చని సమాచారం. అలాగే అంతగా ప్రభావం చూపని కొందరు మంత్రులను తొలగించి కొత్తవారిని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
26 మంది పేర్లు..
కొత్తగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలో మొత్తం 26 మంది పేర్లను భాజపా అగ్రనాయకత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిలో జ్యోతిరాదిత్య సింధియా, వరుణ్ గాంధీ, కైలాష్ విజయ్ వర్గీయ, దినేష్ త్రివేది, సర్బానంద సోనోవాల్, పశుపతి పరాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాకు ఈసారి మంత్రి వర్గవిస్తరణలో కేబినెట్ హోదా ఖాయంగా కనిపిస్తోంది. 2020లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భాజపా అధిష్ఠానం యోచిస్తోంది. నెహ్రూ-గాంధీల కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీ కూడా మంత్రి వర్గ రేసులో ముందున్నారు. వరుణ్ గాంధీ దివంగత సంజయ్ గాంధీ కుమారుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన....2014లో భాజపాలో చేరారు.