Modi Bilateral Talks :ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ విడివిడిగా ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనాల కోసం మోదీ చర్చించారు.
భారత్-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయని ప్రధాని నరేంద్ర తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ తెలిపారు. మరోవైపు.. ప్రపంచమంతా ఒకే కుటుంబమని మోదీతో భేటీ అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్.. ట్వీట్ చేశారు. భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని ఇరుదేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. అధునాతన రక్షణ సాంకేతికత, అభివృద్ధి విషయంలో పరస్పరం పాలుపంచుకుంటామని పేర్కొన్నాయి.
ఖలిస్థానీ నిరసనలపై చర్చ..
భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అభివర్ణించారు. తమ దేశానికి భారత్ ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్ వచ్చిన ట్రూడో.. ఆదివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలతోపాటు ఆయా రంగాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ సైతం ట్వీట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జస్టిన్ ట్రూడో.. కెనడాలో ఖలిస్థానీ నిరసనలపై చర్చించుకున్నట్లు చెప్పారు.
'జీ20 కుటుంబంలో చేరడం ఆనందంగా ఉంది'
మరోవైపు.. భారత ప్రధాని మోదీతో ఆఫ్రికన్ ఛైర్పర్సన్, కామొరోస్ అధ్యక్షుడు అజాలీ అసౌమని భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో ఫలవంతమైన సమావేశం జరిగిందని అజాలీ అసౌమని అన్నారు. G20కుటుంబంలో చేరడం ఆనందంగా ఉందని తెలిపారు.
'భారత్-బ్రెజిల్ మధ్య బలమైన బంధం'
ప్రధాని మోదీతో సమావేశం అద్భుతంగా జరిగిందని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా తెలిపారు. భారత్- బ్రెజిల్ మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. వ్యవసాయం, సాంకేతికత, వాణిజ్యం తదితర అంశాలపై ప్రధాని మోదీతో చర్చించానని లూలా డసిల్వా తెలిపారు.