Modi Biden Bilateral Talks : జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చిన బైడెన్.. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. బైడెన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. ఇరుదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీకి సంబంధించిన చిత్రాలను ప్రధాని మోదీ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. "లోక్‌కల్యాణ్ మార్గ్-7కు బైడెన్‌ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సమావేశం చాలా ఫలప్రదంగా జరిగింది. భారత్- అమెరికా ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచే అనేక అంశాలపై మేమ చర్చించాం. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచానికి మేలు చేసేందుకు ఉపయోగపడుతుంది" అంటూ ట్వీట్ చేశారు.
శ్వేతసౌధం సంయుక్త స్టేట్మెంట్ విడుదల..
మరోవైపు, మోదీతో బైడెన్ జరిపిన ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి శ్వేత సౌధం.. సంయుక్త స్టేట్మెంట్ను విడుదల చేసింది. "భారత్- అమెరికా మధ్య సన్నిహిత, శాశ్వతమైన భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటిస్తూ.. భారతదేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను మోదీ స్వాగతించారు. ఈ ఏడాది జూన్‌లో మోదీ వైట్‌హౌస్ పర్యటనలో తీసుకున్న నిర్ణయాల అమలులో గణనీయమైన పురోగతిని ఇరు దేశాధినేతలు ప్రశంసించుకున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుతున్న భారత్‌కు బైడెన్ తన మద్దతును పునరుద్ఘాటించారు. 2028-29కి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వాన్ని బైడెన్ స్వాగతించారు. బహుపాక్షిక వ్యవస్థను సంస్కరించాలని అవసరాన్ని ఇరు దేశాధినేతలు నొక్కి చెప్పారు" అని వైట్‌హౌస్ జాయింట్ స్టేట్మెంట్లో పేర్కొంది.
ఇస్రో శాస్త్రవేత్తలకు బైడెన్ అభినందనలు..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైనందుకు మోదీతోపాటు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను బైడెన్ అభినందించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దాంతోపాటు భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ ఆదిత్య- ఎల్1ను.. విజయవంతంగా ప్రయోగించినందుకు కూడా బైడెన్ అభినందనలు తెలిపినట్లు పేర్కొంది.
ఇరు దేశాల మధ్య ఒప్పందాలు..
White House Joint Statement India : అమెరికా, భారత్ మధ్య పలు అంశాలపై ఒప్పందాలు కుదిరినట్లు శ్వేత సౌధం తన జాయింట్ స్టేట్మెంట్లో తెలిపింది. అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, భారత బయోటెక్నాలజీ విభాగం మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. బయోటెక్నాలజీ, బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఆవిష్కరణల్లో సహకారంతోపాటు శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలో కలిసి పనిచేసేందుకు ఇరు దేశాధినేతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ, రవాణా వ్యవస్థ, గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పింది.