Modi natural farming: వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాలల నుంచి బయటకు తీసుకొచ్చి.. ప్రకృతికి అనుసంధానం చేయాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రకృతి సేద్యం వైపు మారాలని రైతులను కోరారు. గుజరాత్‌లోని ఆనంద్‌లో నిర్వహించిన.. ప్రకృతి సేత్యం, ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ జాతీయ సదస్సులో వర్చువల్‌గా ప్రసంగించారు మోదీ. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను తెలియజేశారు. పంట వ్యర్థాలను కాల్చటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అది వ్యవసాయ భూమి ఉత్పాదకతకు హాని చేకూర్చుతుందని అన్నారు.
" వ్యవసాయంలో భాగమైన తప్పులను సరిదిద్దాల్సిన సమయం వచ్చింది. హరిత విప్లవంలో రసాయనాలు, ఎరువులు కీలక పాత్ర పోషించాయి. కానీ, వాటి ప్రత్యామ్నాయాలపై పని చేయాల్సిన అవసరాన్ని సూచించాయి. వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు తీవ్రతరం కాకముందే మేల్కొనేందుకు ఇదే సరైన సమయం. చికిత్స కన్నా నిరోధించటమే ఎల్లప్పుడూ సరైనది. ఎరువులు, రసాయనాలను ఎక్కువ ధరలకు దిగుమతి చేసుకోవటం ద్వారా పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది. దాని ద్వారా సామాన్యుడిపై భారం పడుతోంది. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్, సేంద్రియ వ్యవసాయం దోహదపడతాయని పేర్కొన్నారు ప్రధాని. ఈ సదస్సులో వర్చువల్‌గా 8 కోట్ల మంది రైతులు పాల్గొన్నారని.. ఇది కేవలం గుజరాత్‌కే పరిమితం కాకూడదని సూచించారు. దేశంలోని రైతులందరికీ ప్రయోజన చేకూరుతుందని తెలిపారు. సేంద్రియ వ్యవసాయంతో దేశంలోని 80 శాతం మంది సన్నకారు రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని.. కానీ.. 5 ఎకరాల్లోపు రైతులు రసాయనిక ఎరువుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్ ఆధారిత వ్యవసాయంలో విత్తనాల నుంచి నేల వరకు అన్నీ సహజంగానే సేకరించవచ్చని వివరించారు.