Mobile Tower Theft in Bihar : బిహార్‌లో మొబైల్ టవర్‌ను చోరి చేశారు దొంగలు. టవర్ సంస్థ ప్రతినిధులమంటూ చట్టుపక్కల వారిని నమ్మించి దాన్ని చోరి చేశారు. టవర్ మొత్తాన్ని భాగాలుగా విడగొట్టి వాహనంలో తీసుకెళ్లారు. దాంతో పాటు జనరేటర్, స్టెబిలైజర్, మిగతా వస్తువులు సైతం ఎత్తుకెళ్లారు. దొంగలు చేసిన ఈ పనికి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మొబైల్ టవర్ ప్రతినిధులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముజఫర్‌పుర్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్రమజీవి నగర్లో ఉన్న మొబైల్ టవర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. GTAL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు చెందిన మొబైల్ టవర్‌ను.. మనీషా కుమారి అనే మహిళ ఇంటి సమీపంలో ఏర్పాటు చేశారు. దీన్నే దొంగలు చోరి చేశారు. ఘటనపై కంపెనీ ప్రతినిధి షానవాజ్ అన్వర్.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల వారిని విచారించారు. కానీ పోలీసులకు ఎలాంటి సమాచారం లభించలేదు.
సాంకేతిక కారణాల రీత్యా.. కొన్ని నెలలుగా టవర్ పనిచేయడం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో రెండు రోజుల క్రితం దానిని బాగు చేసేందుకు.. కంపెనీ ప్రతినిధులు అక్కడికి వచ్చారు. టవర్ అక్కడ లేకపోవడం చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. "కొద్ది రోజుల క్రితం కొంత మంది వ్యక్తులు ఈ టవర్ వద్దకు వచ్చారు. వారంతా మొబైల్ టవర్ సంస్థకు చెందిన వారిమని చెప్పారు. ఇప్పుడు ఈ టవర్‌తో పనిలేదని.. అందుకు దీనిని తీసుకువెళుతున్నామని తెలిపారు. దీంతో టవర్ మొత్తాన్ని భాగాలుగా విడదీసి.. ఓ వాహనంలో తీసుకెళ్లారు." అని మనీషా కుమారి అనే స్థానిక మహిళ తెలిపారు.
పట్నాలో సెల్‌టవర్ చోరి చేసిన దొంగలు..
రెండు నెలల క్రితం ఈ తరహా ఘటన బిహార్‌లోనే జరిగింది. పట్నాలోని సబ్జీబాగ్లో ఓ భవనంపై అమర్చిన జీటీఎల్(గుజరాత్ టెలీ లింక్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ.. సెల్ టవర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. జీటీఎల్ సంస్థ ఉద్యోగులమని స్థానికులను నమ్మబలికి.. టవర్‌ను ఎత్తుకెళ్లారు. అనంతరం వారు దొంగలని గమనించిన స్థానికలు.. కంపెనీ మేనేజర్‌కి సమాచారం అందించారు. దీంతో కంపెనీ మేనేజర్ దొంగలపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి