మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో సెల్ టవర్ చోరీకి గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడం వల్ల ఫిర్యాదుదారుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు వాలూజ్ ఎంఐడీసీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ.. సెల్ టవర్లను నిర్వహిస్తుంటుంది. నిర్మాణంలోనూ పాలుపంచుకుంటుంది. 2009లో వాలూజ్‌లోని ఓ స్థలాన్ని పదేళ్లపాటు ఈ సంస్థ లీజుకు తీసుకుంది. ఇందుకోసం ఒప్పందం ప్రకారం కంపెనీ.. స్థల యజమానికి నెలకు రూ.9500 అద్దె చెల్లిస్తోంది. ఒప్పందం గడువు ముగియకముందే 2018లోనే ఆస్థలాన్ని ఖాళీ చేయించాడు స్థల యజమాని. అప్పటి నుంచి జీటీఎల్ కంపెనీ పట్టించుకోలేదు.
జీటీఎల్ కంపెనీకి కొత్తగా నియమితులైన ప్రతినిధి అమర్ లాహోత్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ టవర్ కనిపించలేదు. ఆ తర్వాత ఆయన పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. అనంతరం అమర్.. కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో వాలూజ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రూ.34,50,676 విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు అమర్.
షూస్ పోయాయని ఫిర్యాదు..
బిహార్ ముజఫర్‌పుర్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి షూస్‌ను దొంగిలించారు దుండగులు. ఈ ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు సీతామఢికి చెందిన రాహుల్ కుమార్ అనే వ్యక్తి. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ మొరాదాబాద్‌కు వ్యక్తిగత పనినిమిత్తం వెళ్తుండగా తన షూస్ దొంగతనం జరిగినట్లు రాహుల్ తెలిపాడు.