Mob Lynching Over Car Parking In Bihar :కార్ పార్కింగ్‌పై తలెత్తిన వివాదంలో నలుగురు హత్యకు గురయ్యారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో సోమవారం జరిగిందీ ఘటన. మృతుల్లో ఒకరు తుపాకీ కాల్పులు వల్ల చనిపోగా, మూకదాడిలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ దుకాణం ముందు కార్ నిలిపి ఉంచేందుకు అభ్యంతరం తెలపడం ఈ దారుణానికి కారణమైంది.
చిన్న గొడవగా మొదలు
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఔరంగాబాద్‌లోని నవీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దుకాణం ముందు ఓ కారు ఆగింది. అయితే, అక్కడ కార్ పార్క్ చేయడానికి వీలు లేదని ఆ దుకాణదారుడు వాహనంలోని వారికి చెప్పాడు. తక్షణమే అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. కారులోని నలుగురు ఇందుకు అభ్యంతరం తెలిపారు. దుకాణం యజమానికి, వారికి మధ్య ఈ విషయమై గొడవ జరిగింది. సహనం కోల్పోయిన వాహనదారుడు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అయితే గురి తప్పి దుకాణం యజమానికి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతడి పక్కనే ఉన్న వ్యక్తికి తూటా తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.
తుపాకీ కాల్పుల్లో తమ వాడు మరణించడంపై చుట్టుపక్కల దుకాణదారులు, స్థానికులు తీవ్రంగా స్పందించారు. అందరూ కలిసి కార్లో వచ్చిన నలుగురిపై దాడి చేశారు. ఈ మూక దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.