టపాసులు కొన్న తర్వాత జీఎస్‌టీ బిల్లు అడిగిన కర్నల్‌పై మూకదాడి జరిగింది. 'కస్టమర్‌కు జీఎస్‌టీ బిల్లు ఇవ్వడం లేదు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో' అంటూ దుకాణదారుడు విమల్ సింఘానియా... కర్నల్‌పై దాడికి దిగాడు. దాదాపు 20 మంది దుండగులు కర్నల్, ఆయన కుమారుడిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కర్నల్‌కు, ఆయన కుమారుడికి తీవ్ర గాయాలై స్పృహ తప్పి పడిపోయారు. కర్నల్ కుమారుడి కళ్లద్దాలు పగిలి అతని కంటికి గుచ్చుకున్నాయి. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగింది.
రాజస్థాన్‌లోని గంగా నగర్లో విధులు నిర్వర్తిస్తున్న కర్నల్.. దీపావళి సందర్భంగా సెలవుపై స్వస్థలానికి వచ్చారు. కర్నల్, దుకాణదారుడు ఇరుగుపొరుగువారే. దుకాణదారుడు విమల్ సింఘానియా ఆదేశానుసారమే దుండగులు తనపై దాడికి పాల్పడ్డారని కర్నల్ ఆరోపించారు. ఈ ఘటనపై కర్నల్ కుమారుడు ఇషాన్ సింగ్ గోందా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దుకాణం బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దుకాణదారుని సోదరుడు కమల్ సింఘానియా తమకు క్షమాపణలు చెప్పాడని.. కేసు పెట్టొద్దని కోరాడని కర్నల్ తెలిపారు.