MLC Kavitha Reacts on Election Polling :బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రాబోతుందని.. ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక ఘట్టానికి తెరపడిందని.. కేసీఆర్(CM KCR) హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు చిచ్చుపెట్టాలని ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రజలపై తమకు నమ్మకం ఉందని.. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పనున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఓటర్లతో పోటెత్తిన పల్లెలు-ఉవ్వెత్తున నమోదైన పోలింగ్
సంపూర్ణ మెజార్టీతో బీఆర్ఎస్(BRS) అధికారం చేపట్టబోతోందని కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలను ప్రజలు నమ్మబోరని.. కేసీఆర్ వెంటే తెలంగాణ సమాజం ఉందని బుజువు చేయబోతున్నరన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
Telangana Assembly Elections 2023 : మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనల మధ్య రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 63.94 శాతం పోలింగ్ నమోదైంది. సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా.. ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు.