mlc kavitha deeksha in Delhi : మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో , భారత్ జాగృతి సంస్థ అధ్యక్షుకారులు , ఎమ్మెల్సీ కవిత దిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. భారత్ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ దీక్షను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. దీక్షలో బీఆర్ఎస్ ఎంపీలు సహా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. కవిత దీక్షకు వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరై సంఘీభావం తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు 27ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని... 1996లో దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని కవిత తెలిపారు. కేంద్రంలో పూర్తి మద్దతు ఉన్న బీజేపీ సర్కార్ బిల్లు ప్రవేశపెడితే అన్ని పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు వచ్చే వరకూ ఈ పోరాట మార్గాన్ని విడిచే ప్రసక్తే లేదని దేశంలోని సోదరీమణులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఆందోళనను కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లతోనే భారత్ బలోపేతం అవుతుందని అన్నారు.
ఈ బిల్లుతో దేశ ప్రజాస్వామ్యం శక్తిమంతం అవుతుందన్న కవిత... సంపూర్ణ ఆధిక్యం ఉన్న బీజేపీ సర్కార్‌కు ఇది ఓ చారిత్రక అవకాశమన్నారు. మహిళా రిజర్వేషన్లు బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. బిల్లు పెడితే అన్ని పక్షాలకు ఏకం చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. దేశంలోని మహిళలందరినీ ఐక్యం చేసే ప్రయత్నం చేస్తామని హెచ్చరించారు. పార్లమెంటులోనూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమే... దేశవ్యాప్తంగా ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లు బిల్లు వచ్చే వరకు వెనకడుగు వేసేది లేదని వివరించారు.