అసోం-మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో(Assam Mizoram border dispute) వివాదం మళ్లీ రాజుకుంటోంది. మిజోరం ఓ చోట వంతెన నిర్మాణం చేపట్టగా.. అది తమ భూభాగమంటూ అసోం పోలీసులు(Assam police) పనులను అడ్డుకున్నారు. దీంతో వారిపై మిజోరం పోలీసులు 'దొంగతనం' కేసు నమోదు చేశారు. ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగడం వంటి పరిణామాలతో వ్యవహారం ముదురుతోంది.
అది మా భూభాగం: అసోం
మిజోరం అధికారులు తమ భూభాగమైన హైలకండిలోకి అక్రమంగా ప్రవేశించి వంతెన నిర్మాణం ప్రారంభించారని అసోం ప్రభుత్వం (Assam Mizoram border dispute) ఆదివారం ఆరోపించింది. రామ్‌నాథ్‌పుర్ పోలీసు ఠాణా పరిధిలోని కచుర్తాల్ వద్ద మిజోరం నుంచి వచ్చిన కొంతమంది కార్మికులు వంతెన నిర్మాణానికి ప్రయత్నించినట్లు హైలకండి ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్ తెలిపారు. విషయం తెలుసుకున్న రామ్‌నాథ్‌పుర్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిర్మాణ పనులను అడ్డుకున్నట్లు చెప్పారు. దాదాపు 40-50 మంది భద్రత సిబ్బంది మిజోరం నుంచి వచ్చారని, వారిలో కొందరు ఆసోం వైపు చొచ్చుకు వచ్చారని ఆరోపించారు. వారిని వెళ్లిపోవాల్సిందిగా కోరినప్పటికీ నిరాకరించినట్లు చెప్పారు. "ఈ చర్య సరిహద్దు వద్ద శాంతిని నెలకొల్పేందుకు రెండు రాష్ట్రాలూ సంయుక్తంగా ఈనెల 5న చేసిన ప్రకటనను పూర్తిగా ఉల్లంఘించేలా ఉంది" అని పేర్కొన్నారు. దీంతో తన నేతృత్వంలో దాదాపు 200 మంది పోలీసులు ఆదివారం ఉదయం ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు చెప్పారు.