Mizoram Assembly Election 2023 :మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. 40 స్థానాలు ఉన్న అసెంబ్లీకి మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 8.52 లక్షల మంది ప్రజలు ఎన్నికల్లో ఓటేయనున్నారు. మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 50 కంపెనీల సీఏపీఎఫ్ దళాలను భద్రత కోసం రంగంలోకి దించారు. మొత్తం 1276 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అందులో 30 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ బూత్‌లలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. పోలింగ్ సిబ్బందిని సంబంధిత స్టేషన్లకు పంపించినట్లు ఈసీ తెలిపింది. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని వారు వెంట తీసుకెళ్తునట్లు పేర్కొంది.
కనిష్ఠంగా థొరాంగ్(ఎస్టీ) అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలెప్ పోలింగ్ స్టేషన్లో 26 మంది ఓటర్లు ఉండగా.. అయిజాల్ ఈస్ట్-1 స్థానంలోని 24 జెంబావ్క్-8 పోలింగ్ స్టేషన్లో గరిష్ఠంగా 1481 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గాల పరంగా చూసుకుంటే.. థొరాంగ్ స్థానంలో అతి తక్కువగా 14,924 మంది ఓటర్లు ఉన్నారు. అతిపెద్ద నియోజకవర్గమైన తుయిచాంగ్ స్థానంలో 36,041 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 5000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది.. ఎన్నికల విధుల్లో భాగం కానున్నారు.
గెలుపెవరిదో?
అధికార మిజో నేషనల్ ఫ్రంట్.. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి పాలన సాగించాలని భావిస్తోంది. మరోవైపు.. జొరాం పీపుల్స్ మూమెంట్, బీజేపీ, కాంగ్రెస్.. అధికార పార్టీని గద్దెదించాలని ప్రయత్నిస్తున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు సాధించింది. కాంగ్రెస్‌కు 5, బీజేపీకి ఒక సీటు దక్కింది.