బంగాల్ రాజకీయం రోజు రోజుకూ వేడెక్కుతోంది. కీలక నేతలు పార్టీని వీడటం వల్ల తృణమూల్ కాంగ్రెస్ ఆత్మస్థైర్యం కొంతమేర దెబ్బతినగా.. అదే సమయంలో కొత్తగా చేరికలతో రాష్ట్రంలో భాజపా బలం పుంజుకుంది. మమత తర్వాత.. రాష్ట్రంలో నంబర్ 2గా ఉన్న సువేందు అధికారి తృణమూల్‌ను వీడి భాజపాలో చేరడం కమలం పార్టీకి కొంతమేర ఊపు రాగా, తాజాగా.. బంగాల్‌కు చెందిన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి చేరికతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. అయితే, మమతను ఢీకొట్టడానికి ఈ బలం సరిపోతుందా? మిథున్ చక్రవర్తి భాజపా విజయానికి ఎంతమేర తోడ్పడగలరు?
బంగాల్‌కు చెందిన ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో.. ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే, శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడం వల్ల తన పదవికి రాజీనామా చేశారు. శారదా కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించినందుకు గానూ వచ్చిన మొత్తాన్ని ఆయన ఈడీకి స్వాధీనం చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా.. ఎన్నికల ముందు అనూహ్యంగా భాజపాలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు మిథున్. అంతకుముందు.. కొద్ది కాలం క్రితమే ఆయన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో భేటీ అయ్యారు. ఆయన సూచన మేరకే మిథున్ చక్రవర్తి నాలుగేళ్ల విరామం తర్వాత రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. సువేందుకు అధికారికి మిత్రుడైన మిథున్ చక్రవర్తి చేరికతో భాజపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఇదీ చదవండి:'నేనో కోబ్రా.. ఒకే కాటుకు అంతం చేస్తా'
మమత వ్యూహానికి చెక్ పెట్టేందుకేనా.?
బంగాల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే తృణమూల్ కాంగ్రెస్ కొత్త నినాదం అందుకుంది. భాజపా దిల్లీ పార్టీ అని, తాను బంగాల్ కుమార్తెనని మమత ప్రకటించుకున్నారు. ఈ నినాదాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తృణమూల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, మమత వ్యూహాలకు చెక్ పెడుతూ మిథున్ చక్రవర్తిని తెరపైకి తీసుకురావడం వల్ల.. భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బంగాల్ బిడ్డగా ఆయనను ముందు పెట్టడమే కాకుండా.. సీఎం అభ్యర్థిగానూ ప్రకటించాలని భాజపా యోచిస్తోంది. సాధారణంగా భాజపాలో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగా ప్రకటించే సంప్రదాయం లేదు. అయితే, ఆరెస్సెస్ సూచించిన వ్యక్తే సీఎం అభ్యర్థిగా నియమితులవుతుంటారు. భాగవత్ ఎంపిక చేసిన వ్యక్తి కాబట్టి ఆయన పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేవని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మిథున్ చక్రవర్తిని ఉద్దేశించి బంగాల్ కుమారుడు అని మోదీ పేర్కొనడం కూడా ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది.