Mahua Moitra Comment: కాళీమాతను మాంసాహారిగా, మద్యం స్వీకరించే దేవతగా తాను నమ్ముతున్నానంటూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన ఆమెను అరెస్టు చేయాలని భాజపా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. మనుషులు తప్పులు చేస్తారని.. వాటిని సరిదిద్దుకోవచ్చని మాట్లాడారు. కోల్‌కతాలో విద్యార్థులకు క్రెడిట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
''మనుషులు తప్పులు చేస్తారు.. కానీ వాటిని సరిదిద్దుకోవచ్చు. మేం కూడా పని చేస్తున్నప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ ఆ తర్వాత సరిదిద్దుకుంటాం. కొందరు మంచి పనిని సహించక అరుస్తుంటారు. ప్రతికూల ఆలోచనలు మన మెదడుకు మంచిది కాదు. అందుకే సానుకూల దృక్పథంతో ఆలోచించండి.''
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
మహువాను టీఎంసీ నుంచి సస్పెండ్ చేయాలని భాజపా నేతలు తృణమూల్ కాంగ్రెస్‌కు సూచించారు. దీంతో.. కాళీపై మొయిత్రా వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ మంగళవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను ఆమె బుధవారం అన్‌ఫాలో చేశారు. కానీ.. దీదీ ట్విట్టర్ అకౌంట్‌ను మాత్రం అనుసరిస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలతో త్వరలోనే మొయిత్రా తృణమూల్‌ను వీడవచ్చని పలువురు విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలోనే దీదీ పైవ్యాఖ్యలు చేశారు.