Missionaries of charity bank account frozen: మదర్ థెరిసా పేదల కోసం స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసిందని వచ్చిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఖాతాల ఫ్రీజ్ అంశాన్ని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు.
"మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపజేసిందనే వార్తను క్రిస్మస్ రోజున వినటం దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో వాటిల్లోని 22వేల మంది రోగులు, ఉద్యోగులు ఔషధాలు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. చట్టం ప్రధానమైనప్పటికీ, మానవతా ప్రయత్నాలలో ఎలాంటి రాజీ ఉండకూడదు."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
మమత ట్వీట్ చేసే సమయానికి కోల్కతాలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ కార్యాలయం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, ఈ అంశాన్ని రాష్ట్ర సర్కార్ దృష్టికి ఛారిటీ సంస్థ తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.
హోంశాఖ స్పష్టత..
అయితే తాము మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఖాతాలను ఫ్రీజ్ చేయలేదని కేంద్ర హోంమంత్రిత్వశాఖ స్పష్టతనిచ్చింది. సంబంధిత మిషనరీలే ఖాతాలను నిలిపివేయాలని కోరినట్లు ఎస్బీఐ తమకు సమాచారం ఇచ్చిందని వివరణ ఇచ్చింది.
"మిషనరీస్ ఆఫ్ ఛారిటీ విదేశీ విరాళాల చట్టం ప్రకారం చేయాల్సిన రెన్యువల్ దరఖాస్తు డిసెంబర్ 25న తిరస్కరణకు గురైంది. నిబంధనలు పాటించనందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే దరఖాస్తులను పునఃసమీక్షించాలని మాకు ఎలాంటి విజ్ఞప్తులు అందలేదు. ఈ మిషనరీల రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. కానీ హోంశాఖ డిసెంబర్ 31వరకు దాన్ని పొడిగించింది. మిషనరీల బ్యాంకు ఖాతాలను కూడా కేంద్రం ఫ్రీజ్ చేయలేదు. మిషనరీలే తమ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఎస్బీఐని విజ్ఞప్తి చేశాయి. "