తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదేళ్ల క్రితం తప్పిపోయిన భర్త అనుకుని భార్య ఎమోషనల్.. ఇంటికి తీసుకెళ్లి పుట్టుమచ్చలు చూస్తే.. - ఉత్తర్​ప్రదేశ్​లో పదేళ్ల తర్వాత కనిపించిన వ్యక్తి

Missing Man Found After 10 Years In Uttarpradesh : మతిస్థిమితం లేని ఓ వ్యక్తిని.. పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తగా భావించింది ఓ మహిళ. తన కుమారులకు సమాచారం ఇచ్చి ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లాక ప్రశ్నించగా.. సమాధానం లేదు. అనుమానం వచ్చి పుట్టుమచ్చలు చూస్తే.. అతడు తన భర్త కాదనే అసలు విషయం తెలిసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

Missing Man Found After 10 Years In Uttarpradesh
Missing Man Found After 10 Years In Uttarpradesh

By

Published : Jul 30, 2023, 11:50 AM IST

Updated : Jul 30, 2023, 3:39 PM IST

Missing Man Found After 10 Years In Uttarpradesh : అనారోగ్యంతో బాధపడుతూ తప్పిపోయిన భర్తను.. పదేళ్ల తర్వాత కలిసిన ఘటన ఊహించని మలుపు తిరిగింది. కుమారులకు సమాచారం అందించి ఆ వ్యక్తిని ఇంటికి తీసుకెళ్లిన భార్య.. తీరా చూస్తే అతడు తన భర్త కాదనే విషయం తెలిసింది. దీంతో కంగుతిన్న భార్య.. తీసుకొచ్చిన వ్యక్తికి క్షమాపణలు చెప్పి వారి కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బలియా జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది..
బలియా పోలీస్​ స్టేషన్ ప్రాంతంలోని దేవ్‌కలి గ్రామానికి చెందిన మోతీచంద్ వర్మ (45)కు 21 ఏళ్ల క్రితం జానకి దేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత నుంచి మోతీచంద్ మానసిక పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. దీంతో మోతీచంద్‌ను తన బంధువులతో పాటు చికిత్స కోసం నేపాల్‌కు పంపించింది జానకి. ఈ క్రమంలో మోతీచంద్ తప్పిపోయాడు. అతడి ఆచూకీ కోసం తండ్రి ఎంతగానో ప్రయత్నించినా ప్రయోజనం లేదు.

ఆ తర్వాత భర్త ఆచూకీ కోసం భార్య జానకి దేవి స్వయంగా రంగంలోకి దిగింది. తన సోదరుడితో కలిసి నేపాల్ వెళ్లి గాలించింది. ఇంటింటికీ తిరిగి వెతికింది. తాంత్రికులు, బాబాల సాయం కూడా తీసుకుంది. వీటితో పాటు ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లినా.. భర్త మోతీచంద్ ఫొటోను తనతో తీసుకెళ్లేది. తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు సహకరించాలని అధికార యంత్రాంగానికి లేఖ రాసినా వారు పట్టించుకోలేదు. ఇన్ని రకాలుగా ప్రయత్నించినా.. జానకి తన భర్త ఆచూకీ తెలుసుకోలేకపోయింది.

అయితే, అనారోగ్యంగా ఉన్న తన కుమారుడి కోసం రోజూ బలియా జిల్లా ఆస్పత్రికి వెళ్తుండేది జానకి. ఈ క్రమంలో శనివారం కూడా అలాగే వెళ్లింది. ఆ ఆస్పత్రి సమీపంలోని రోడ్డు పక్కన చిరిగిన పాత బట్టలు వేసుకుని.. పెరిగిన గడ్డంతో ఉన్న ఓ వ్యక్తిని చూసింది. అతడిని తన భర్తగా భావించిన జానకి దేవి.. అతడిని కౌగిలించుకుని, దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ఏడ్చేసింది. అనంతరం కుమారులకు సమాచారం అందించి ఇంటికి తీసుకుని వెళ్లింది.

తన భర్త అనుకుని భావోద్వేగానికి లోనైన జానకి

ఇక్కడ వరకు కథ బాగానే ఉన్నా ఇంటికి వెళ్లాక పరిశీలిస్తే.. అసలుకే మోసం వచ్చింది. ఇంటికి తీసుకెళ్లి అతడిని ప్రశ్నించగా.. ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానించిన జానకి దేవి అతడి పుట్టుమచ్చలు చూడగా.. అసలు విషయం బయటపడింది. జానకి దేవి తీసుకొచ్చిన వ్యక్తి మోతీచంద్ కాదని, అతడి పేరు రాహుల్​ అని తేలింది. దీంతో తప్పు తెలుసుకున్న జానకి దేవి.. రాహుల్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించింది.

Last Updated : Jul 30, 2023, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details