తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడేళ్ల వయసులో బాలిక మాయం.. 9 సంవత్సరాల తర్వాత కిడ్నాపర్ దొరికాడిలా... - మహారాష్ట్ర అంధేరి డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్

తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్​కు గురైన బాలిక ఆచూకీని గుర్తించారు పోలీసులు. బాలికను సురక్షితంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

missing girl meets family
తొమ్మిదేళ్ల క్రితం బాలిక కిడ్నాప్.. కేసును చేధించిన పోలీసులు

By

Published : Aug 7, 2022, 1:25 PM IST

Updated : Aug 7, 2022, 4:18 PM IST

ఏడేళ్ల వయసులో బాలిక మాయం.. 9 సంవత్సరాల తర్వాత కిడ్నాపర్ దొరికాడిలా...

ముంబయిలోని అంధేరి ప్రాంతంలో 2013 జనవరి 22న పూజ అనే ఏడేళ్ల బాలిక అదృశ్యమైంది. సోదరుడితో పాటు స్కూల్‌కు వెళ్లిన బాలికను హారీ డిసౌజా అనే వ్యక్తి ఎత్తుకుపోయాడు. పిల్లలు లేకపోవడం వల్ల తాను పెంచుకోవాలని ఆమెను అపహరించాడు. బడికి వెళ్లిన పాప ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల.. అంతా వెతికిన తల్లిదండ్రులు, బంధువులు స్థానిక డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర భోస్లే ఆ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. రెండేళ్లుగా గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. రిటైరైన తర్వాత కూడా ఆయన ఆ కేసును వదల్లేదు. హారీ డిసౌజా పోలీసుల భయంతో బాలికను.. తన సొంతూరు కర్ణాటకలోని రాయచూర్‌లో ఒక హాస్టల్‌లో చేర్చాడు. 2016లో డిసౌజా దంపతులకు కొడుకు పుట్టాడు. ఆ తర్వాత కర్ణాటకలో ఉన్న బాలికను తిరిగి ముంబయి రప్పించాడు. ఇద్దరు పిల్లలను పెంచే స్తోమత లేకపోవడం వల్ల కొడుకును చూసుకునే బాధ్యతను బాలికకు అప్పగించాడు. ఇళ్లలో పనులకు పంపి బాలిక ద్వారా డబ్బులు సంపాదించేవాడు.

తొమ్మిదేళ్ల క్రితం బాలిక కిడ్నాప్.. కేసును చేధించిన పోలీసులు

కొన్నినెలల క్రితం డిసౌజా దంపతులు.. అంధేరి ప్రాంతంలోని ఇల్లు మారారు. సరిగ్గా అదే ప్రాంతంలో చిన్నప్పుడు బాలిక పూజ కుటుంబంతో పాటు నివసించింది. బాలిక పెద్దది కావడం వల్ల ఆమెను ఎవరూ గుర్తించలేరని డిసౌజా భావించాడు. ఎవరితోనూ బాలికను మాట్లాడేందుకు ఒప్పుకునేవాడు కాదు. బాలిక ఇళ్లలో పనులకు వెళ్లినప్పుడు అదే ప్రాంతంలో ఇళ్లలో పనిచేసే 35 ఏళ్ల మహిళ.. ప్రమీలా దేవేంద్రతో పరిచయం అయ్యింది. తనను కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని వారు తన అసలు తల్లిదండ్రులుకారని ప్రమీలకు బాలిక చెప్పింది. ఇంటర్నెట్‌లో బాలిక అదృశ్యంపై సెర్చ్‌చేసిన ప్రమీలకు.. పూజ అనే బాలిక అదృశ్యమైన వార్తలు కనిపించాయి. పనులు చేస్తున్న బాలికే పూజ అనే అనుమానంతో ప్రమీల డీఎన్​ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

తొమ్మిదేళ్ల క్రితం బాలిక కిడ్నాప్.. కేసును చేధించిన పోలీసులు

ప్రమీల ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పూజ గురించి ఆరా తీశారు. విశ్రాంత అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర భోస్లే పోలీసులకు అప్పటి కేసు వివరాలను అందించడం వల్ల కేసును చేధించడం తేలికైంది. బాలిక డిసౌజా దంపతుల సొంత కుమార్తె కాదని నిర్దరణ కావడం వల్ల.. హారీ డిసౌజా దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు పూజను ఎత్తుకొచ్చినట్లు అంగీకరించారు. డిసౌజా, అతడి భార్య సోనీలను అరెస్ట్ చేశారు. వారిపై అపహరణ, మానవ అక్రమ రవాణా, అక్రమ నిర్భందం కేసులు నమోదు చేశారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఏడేళ్ల వయసులో కనిపించకుండా పోయిన బాలిక 16 ఏళ్ల వయసులో తిరిగి రావడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. కేసును చేధించిన డీఎన్​ నగర్ పోలీసులను ముంబయి పోలీస్ కమిషనర్‌ వివేక్ ఫనసాల్కర్ అభినందించారు.

తొమ్మిదేళ్ల క్రితం బాలిక కిడ్నాప్.. కేసును చేధించిన పోలీసులు

ఇవీ చదవండి:కంప్యూటర్ సెంటర్​లో మహిళపై గ్యాంగ్​రేప్.. కుమార్తె హత్యకు రూ.లక్ష సుపారీ..

కరెంట్ స్తంభానికి కట్టి కర్రలతో దాడి.. గిలగిలా కొట్టుకుంటూ వృద్ధుడు మృతి

Last Updated : Aug 7, 2022, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details