మృతదేహాలను మార్చురీలో భద్రపరిచినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మృతదేహాలు పాడవ్వకుండా ఫ్రీజర్లలో ఉంచుతారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మృతదేహం నుంచి వాసన రాకుండా లేపనాలు కూడా పూస్తారు. అయితే మధ్యప్రదేశ్.. సాగర్ జిల్లా ఆస్పత్రిలో మృతదేహాల కళ్లు మాయమయ్యాయి. ఇలా ఒకసారి జరిగితే నిర్వహణ లోపం అనుకోవచ్చు. రెండోసారి కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అయితే.. ఈ ఘటనలకు ఎలుకలే కారణమై ఉండొచ్చని వైద్యాధికారులు చెప్పడం గమనార్హం.
ఎలుకలు కన్ను ఎత్తుకుపోయాయి!
32 ఏళ్ల మోతీలాల్ పొలంలో అపస్మారక స్థితిలోకి వెళ్లడం వల్ల కుటుంబ సభ్యులు జనవరి 4న సాగర్ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించిన వైద్యులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. జనవరి 5న వైద్యుడు వచ్చి చూసేసరికి ఓ కన్ను మాయమైంది. అయితే ఫ్రీజర్ సరిగా పని చేయకపోవడం వల్ల మృతదేహాన్ని బయటే ఉంచాల్సి వచ్చిందని అందువల్ల ఎలుకలు కన్ను ఎత్తుకుపోయి ఉండొచ్చని అక్కడి వైద్యులు వివరణ ఇచ్చారు.