Miss Ocean Competition World 2023 :2023 మిస్ ఓషన్ వరల్డ్ పోటీల్లో ముంబయికి చెందిన అవంతి ష్రాఫ్ అనే యువతి రన్నరప్‌గా నిలిచారు. మొత్తం 12 దేశాలకు చెందిన అందగత్తెలు.. ఈ పోటీల్లో పాల్గొనగా.. యూకేకు చెందిన లారా మొదటి స్థానం సంపాదించారు. రాజస్థాన్ జైపుర్‌లోని చోము ప్యాలెస్‌లో ఈ పోటీలు జరిగాయి. భారత్‌లో ఈ పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా ఫస్ట్ రన్నరప్‌గా బల్గేరియాకు చెందిన ఆండ్రియా నిలవగా.. సెకండ్ రన్నరప్‌గా అవంతి ష్రాఫ్ విజయం సాధించారు.
మొత్తం 12 దేశాల నుంచి 12 మంది పోటీదారులు ఈ మిస్ ఓషన్ వరల్డ్-2023 పోటీల్లో పాల్గొన్నారు. అన్ని రౌండ్లు దాటుకుని అవంతి ష్రాఫ్ రన్నరప్‌గా నిలిచారు. తాను గతంలో చాలా పోటీల్లో పాల్గొన్నప్పటికీ.. ఈ పోటీలు చాలా ప్రత్యేకమైనవి ఆమె పేర్కొన్నారు. క్రితం పోటీల్లో తన కోసం మాత్రమే పాల్గొన్నట్లు అవంతి తెలిపారు. కానీ మిస్ ఓషన్ వరల్డ్ 2023లో మాత్రం దేశం కోసం గెలవాలనుకున్నట్లు ఆమె వెల్లడించారు. అందుకే ఈ పోటీల్లో తాను కాస్త ఒత్తిడికి గురైనట్లు ఆమె వివరించారు.
"ఈ పోటీల్లో.. 'సముద్ర తీరాన్ని కాపాడేందుకు మీరు ఏ విధంగా కృషి చేస్తారు' అనే ప్రశ్నను నిర్వహకులు నన్ను అడిగారు. ముంబయిలో ఉంటూ వివిధ సామాజిక సంస్థలతో కలిసి.. బీచ్‌లను శుభ్రం చేసే చాలా కార్యక్రమాలలో నేను పాల్గొన్నాను. అదే విషయాన్ని వారికి చెప్పాను. ఆ అనుభవం ఈ పోటీల్లో నాకు బాగా పనికొచ్చింది" అని అవంతి చెప్పుకొచ్చారు. ఈ పోటీల్లో రాణించడం చాలా సంతోషంగా ఉందని ఆమె వివరించారు.