జీతం గురించి ఇద్దరు డ్రైవర్లు, ఓ యజమాని మధ్య జరిగిన వాగ్వాదం.. ఓ కుటుంబం పరిస్థితినే తారుమారు చేసింది. తండ్రి చేతిలో సొంత కుమారుడు మృతిచెందడానికి కారణమైంది. జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది.
రాజేశ్ ప్రభు కుమారుడు సుధీంద్ర రాజేశ్ ప్రభు ఫ్యామిలీ ఫొటో అలా గొడవ మొదలైంది..
మంగళూరు సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్గాన్ గేట్ వద్ద రాజేశ్ ప్రభు అనే వ్యక్తి కార్గో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వైష్ణవి కార్గో ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీలో పనిచేసే ఇద్దరు డ్రైవర్లు.. జీతం అడిగేందుకు ఆఫీసుకు మంగళవారం వచ్చారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉన్న రాజేశ్ ప్రభు భార్యతో వారిద్దరూ గొడవ పడ్డారు. ఈ విషయంపై ఆమె ప్రభుకు ఫోన్ చేయగా.. అతను తన కుమారుడితో సహా అక్కడికి చేరుకున్నాడు.
ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. డ్రైవర్లు ప్రభు కుమారుడు సుధీంద్రపై దాడి చేయగా.. వెంట తెచ్చుకున్న లైసెన్స్డ్ తుపాకీతో ప్రభు డ్రైవర్లపై కాల్పులకు యత్నించాడు. ఈ క్రమంలో మిస్‌ఫైరింగ్ జరిగి ఓ బుల్లెట్ అతని కుమారుడి తలలోకి దూసుకెళ్లింది. హుటాహుటిన సుధీంద్రను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే... అతడ్ని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు అక్కడి వైద్యులు.
కన్న కొడుకును చేజేతులా చంపుకున్నానని మనస్తాపం చెందిన రాజేశ్ ప్రభుకు అదే రోజున గుండెపోటు వచ్చింది. కుమారుడికి చికిత్స అందించిన ఆసుపత్రిలోనే తండ్రిని చేర్చారు. కుమారుడు బ్రెయిన్ డెడ్ అని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు దుఃఖంతో కుమిలిపోయారు. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్న ప్రభు.. అవయవదానం ద్వారా ఇతరులలో తన కుమారుడిని చూసుకోవాలనుకున్నాడు. అందుకే అతని అవయవాలను దానం చేసేందుకు అంగీకరించాడు.
ఇదీ చూడండి :రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్- బోనస్‌గా 78 రోజుల వేతనం