తెలంగాణ

telangana

ETV Bharat / bharat

11ఏళ్ల తర్వాత 'పాక్​' చెర నుంచి ఇంటికి... - పాక్​ నుంచి ఇండియాకు వచ్చిన భారత వాసి

పదకొండేళ్ల క్రితం ఇల్లు వదిలిపోయిన ఓ వ్యక్తి ఎట్టకేలకు సొంతూరు చేరాడు. అనుకోకుండా వెళ్లి పాక్​ జైల్లో 11 ఏళ్లు జీవనం సాగించిన అతడు.. చివరకు మతిస్తిమితం కోల్పోయి ఇంటికి వచ్చాడు. కనీసం సమీప బంధువుల్నీ గుర్తించలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి.. అతడి సోదరి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

Mirzapur man returns home after being jailed in Pakistan for years
11ఏళ్ల తర్వాత 'పాక్​' చెర నుంచి ఇంటికి...

By

Published : Jan 10, 2021, 7:17 PM IST

Updated : Jan 10, 2021, 7:24 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో అదృశ్యమైన ఓ వ్యక్తి 11ఏళ్ల తర్వాత సొంతూరికి వచ్చాడు. ఇన్నేళ్లూ పాకిస్థాన్​లో జైల్లో గడిపిన పున్వాసి.. ఎట్టకేలకు మిర్జాపుర్​కు చేరుకున్నాడు. అయితే.. జ్ఞాపకశక్తి మందగించిన అతడు.. కనీసం తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులనూ గుర్తించలేని స్థితిలో ఉండటం.. అక్కడి వారిని కలచివేస్తోంది. ఈ తరుణంలో పున్వాసి మళ్లీ ఇల్లు వదిలి వెళతాడేమోననే భయంతో.. రాత్రంతా అతడికి కాపలాగా ఉందా కుటుంబం.

సోదరి దిగ్భ్రాంతి..

కొత్వాలి ప్రాంతానికి చెందిన పున్వాసి.. 2009లో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. 11 ఏళ్ల పాటు పాక్​ జైల్లోనే నరకం అనుభవించిన అతడు.. ఎట్టకేలకు ఈ నెల 5న ఇంటికి చేరుకున్నాడు. అతడి తల్లిదండ్రులు, ఐదుగురు అన్నదమ్ములు చనిపోయారు. అతడి గుడిసె కూలిపోయింది. ఒక్కగానొక్క సోదరి కిరణ్​ దేవి.. లాల్​గంజ్​ బహుతిలోని వాళ్ల బంధువుల ఇంట్లో ఉంటోంది. తన సోదరుడు వచ్చాడనే వార్త తెలియగానే.. ఎంతో సంతోషించింది. అయితే.. మతిస్తిమితం సరిగాలేని అతడిని కలవగానే ఆ ఆనందం కాస్తా ఆవిరై.. తీవ్ర విచారానికి లోనైందామె.

పున్వాసి మానసిక స్థితికి సంబంధించి చికిత్స చేయించాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించింది అతడి సోదరి.

పున్వాసి
పున్వాసితో సోదరి కిరణ్​ దేవి

అలా వెళ్లి.. పాక్​ ​లోకి..

2009 మే 9న ఇల్లు వదిలిన పున్వాసి.. రాజస్థాన్​లోని జోధ్​పుర్​ మీదుగా దేశ సరిహద్దులు దాటి పాక్​లోకి అడుగుపెట్టాడట. వీసా లేకుండా పట్టుబడిన అతడ్ని లాహోర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదుచేసి జైలుకు పంపారు అక్కడి పోలీసులు.

అడ్రస్​లేక.. ఆలస్యమై!

అయితే.. పున్వాసి చిరునామాకు సంబంధించి సరైన వివరాలు దొరక్క... భారత అధికారులు అతడ్ని రక్షించేందుకు చాలా సమయమే పట్టింది. ఐదేళ్ల క్రితమే అతడి చిరునామా కోసం.. వారణాసి జిల్లా కలెక్టర్​కు ఓ లేఖ రాగా.. అది సరికానిదిగా భావించి వెనక్కిపంపారు. 2019 ఫిబ్రవరి 6న మరోసారి ఆరా తీయగా.. ఎట్టకేలకు గతేడాది అక్టోబర్​ 1న మిర్జాపుర్​లోని అతడి నివాసాన్ని గుర్తించారు అధికారులు. అనంతరం.. నవంబర్​ 17న అతడ్ని భారత్​కు అప్పగించింది పాక్.

ఇదీ చదవండి:గెజిటెడ్ అధికారుల్ని ప్యూన్​లుగా మార్చిన యోగి!

Last Updated : Jan 10, 2021, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details