Mirchi Rasgulla: స్వీట్లలో ప్రత్యేకత కలిగిన రసగుల్లా బంగాల్లో పుట్టింది. అయితే రసగుల్లా తమదంటే తమదని.. బంగాల్, ఒడిశా మధ్య వివాదం ఉంది. తీపికి మారుపేరుగా మధురమైన రుచితో దేశ విదేశాల్లోనూ రసగుల్లాకు మంచి డిమాండ్ ఉంది. శుభకార్యాల్లో, విందుల్లో రసగుల్లాకు కచ్చితంగా స్థానం ఉంటుంది. అలాంటి రసగుల్లా బిహార్‌లో మాత్రం ఘాటెక్కుతోంది. బిహార్ రాజధాని పట్నాలో మిర్చి రసగుల్లా పేరుతో.. తయారు చేస్తున్న వంటకం ఇప్పుడు వినియోగదారుల మన్నన పొందుతోంది.
Patna Green chilli Rasgulla
పట్నాలోని చట్కారా ఫుడ్ కోర్టు నిర్వాహకులు పచ్చిమిర్చితో చేసిన రసగుల్లాను తయారు చేశారు. ఈ రసగుల్లాలో కొంత తీపి కూడా కలిసినప్పటికీ మిర్చి ఘాటు ఎక్కువ ఉంటుంది. షుగర్ రోగులకు ఈ రసగుల్లా చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్వీట్ షాప్ నిర్వాహకులు చెప్పారు. తీపి రసగుల్లాకు ఇప్పటికీ ఆదరణ తగ్గకపోయినప్పటికీ మిర్చి రసగుల్లాను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారని దుకాణదారులు తెలిపారు. రుచిలో మార్పు కోరుకునే వినియోగదారులకు.. ఇప్పుడు మిర్చి రసగుల్లా నచ్చుతోందని చెబుతున్నారు.
పట్నాలోని చట్కారా ఫుడ్ కోర్ట్‌ను భాజపా నాయకుడు, సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ కుమారుడు దీపక్ చౌరాసియా నడిపిస్తున్నారు. చాలా కాలంగా నాణ్యమైన తినుబండారాలు సరఫరా చేస్తున్నామని, వైవిధ్యమైన రుచులను కూడా అందిస్తున్నామని నిర్వాహకుడు చోటూ చెప్పారు.