Mira Road Killing Case : మహారాష్ట్ర ఠాణెలో సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా చంపిన కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భాగస్వామి సరస్వతిని చంపిన తరువాత నిందితుడు మనోజ్.. ఆమె మృతదేహానికి ఫొటో తీశాడని పోలీసులు తెలిపారు. సరస్వతిని చంపే ముందు ఆమె శరీర భాగాలను ఎలా పారవేయాలి, దుర్వాసన రాకుండా ఏం చేయాలని తెలుసుకోవడం కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడని వెల్లడించారు. వీడియోలు సైతం చూశాడని పేర్కొన్నారు. అదే విధంగా మనోజ్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం పూర్తిగా అవాస్తవమని పోలీసులు నిర్ధరించారు.
అరెస్ట్ తరువాత తాను, సరస్వతి అనాథలమని పోలీసులకు చెప్పాడు మనోజ్. కానీ అదంతా అబద్ధమని పోలీసులు తేల్చారు. గురువారం ముగ్గురు మహిళలు.. తాము సరస్వతి సోదరిలమంటూ పోలీసులను ఆశ్రయించారు. తాము ఐదుగురు అక్కాచెల్లెళ్లమని.. అందరికంటే సరస్వతి చిన్నదని పోలీసులకు వివరించారు. దీంతో ఆ మహిళలు చెప్పిన విషయాలను ధ్రువీకరించేందుకు.. వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అనంతరం వారందరిని అక్కాచెల్లెళ్లుగా నిర్ధరించుకుని.. సరస్వతి మృతదేహాన్ని వారికి అప్పగించారు.
కాగా మనోజ్‌కు సైతం ముంబయిలో బంధువులు ఉన్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. మనోజ్‌కు హెచ్ఐవీ ఉందా? లేదా? అన్న దానిపై మాత్రం పోలీసులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే నిందితుడికి ఇంకా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించనట్లు సమాచారం. తన భాగస్వామి సరస్వతి హత్యకు ముందు నిందితుడు గూగుల్‌లో సెర్చ్ చేశాడని పోలీసులు తెలిపారు. శరీర భాగాలను ఎలా పారవేయాలి.. వాసన రాకుండా ఏం చేయాలన్న దానిపై.. వీడియోలు కూడా చూశాడని వారు పేర్కొన్నారు. ఓ వెబ్ సిరీస్ చూసి మనోజ్ ఈ తరహా ఘటనకు పాల్పడినట్లు వివరించారు. అనంతరం సరస్వతిని హత్యచేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి.. కుక్కర్లో ఉడికించిన తరువాత మూడు బకెట్లలో కుక్కాడని పోలీసులు పేర్కొన్నారు.
హత్య ఘటన వివరాలు..
మృతురాలు సరస్వతి వైద్య (36), నిందితుడు మనోజ్ సహానీ (56) సహజీవనం చేస్తూ ఠాణెలోని మీరా రోడ్ అపార్ట్మెంట్లో గత మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన పొరుగింటివారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌కు వచ్చి పరిశీలించిన పోలీసులకు.. గదిలో మృతదేహం లభించింది. దీంతో సరస్వతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్కలు ముక్కలుగా నరికిన శరీర భాగాలు.. బకెట్లలో కనిపించాయని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని వారు అనుమానించారు.
Body parts boiled in cooker : సహానీ బెడ్రూమ్లో భారీ ప్లాస్టిక్ బ్యాగులు, రక్తపు మడుగులో ఉన్న చెట్లు నరికే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్ కుక్కర్‌తో పాటు గిన్నెల్లో శరీర భాగాలను ఉడకబెట్టినట్లు గుర్తించారు. ఇంకొన్ని శరీర భాగాలను మిక్సీలో వేసినట్లు తెలిపారు. మహిళ వెంట్రుకలు, సగం కాలిన ఎముకలు, శరీర భాగాలు కిచెన్ సింక్‌లో, బకెట్లలో కనిపించాయి. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని న్యాయస్థానం జూన్ 16 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.