Minsters Responded on Vizag STEEL PLANT Issue: భారత రాష్ట్ర సమితి తెగించి కొట్లాడిన తర్వాతే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది ముఖ్యమంత్రి మాత్రమేనని తెలిపారు. ఆ ప్రభావంతోనే కేంద్రం ఈ ప్రకటన చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టీ ప్రైడ్ కింద ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవార్డులు, ప్రోత్సాహకాలను కేటీఆర్ అందించారు. తెలంగాణ రాక ముందు మనల్ని అవహేళన చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఇవాళ ఏం చేస్తుందో కేంద్రం కూడా అదే చేస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులు గొప్పగా ఎదుగుతున్నారని.. దళితబంధు పథకం కేసీఆర్‌లాంటి దమ్మున్న నాయకునితోనే సాధ్యమని అన్నారు. ఇంటింటికీ వంద శాతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందని పేర్కొన్నారు.
ప్రజల ఆశీర్వాదం ఉంటేనే:అదే గుజరాత్‌లో 12 ఏళ్లు గడిచినా ఇంకా పనులు పూర్తి కాలేదని కేటీఆర్ తెలిపారు. ఎర్రటి ఎండల్లో కూడా జలాశయాల్లో నీరు నిండుకుండలా ఉన్నాయని పేర్కొన్నారు. నీళ్లు వచ్చాయా, ఎక్కడున్నాయని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి అవి చూపిస్తానని రమ్మంటే.. రాకుండా పైకి మళ్లీ తమపైనే ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. దళిత, గిరిజనుల పారిశ్రామిక వేత్తల కోసం.. రెండెకరాల స్థలాన్ని దండుమల్కాపూర్‌లో రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇప్పిస్తామని తెలిపారు. ప్రజల ఆశీర్వాదం ఉంటేనే అధికారంలో ఉంటామని.. లేదంటే ఎవరైనా చెత్త బుట్టలో ఉండాల్సిందేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.