దేశంలోని మైనారిటీలను బలహీన వర్గాలుగా గుర్తించాలని జాతీయ మైనారిటీ కమిషన్(ఎన్‌సీఎం) సుప్రీంకోర్టును కోరింది. మెజార్టీ వర్గీయుల ప్రాబల్యం అధికంగా ఉన్నందున ఈ ఏర్పాటు అవసరమని తెలిపింది. రాజ్యాంగ పరమైన రక్షణలు ఉన్నప్పటికీ అసమానత, వివక్షకు గురవుతున్నామన్న భావన మైనారిటీల్లో ఉన్నందున రాజ్యాంగంలోని 46వ అధికరణానికి అనుగుణంగా ఈ గుర్తింపు ఇస్తే మంచిదని పేర్కొంది. ఈ మేరకు 40 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది.
మైనారిటీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నీరజ్ శంకర్ సక్సేనా, మరో అయిదుగురు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనివల్ల మెజార్టీ మతంలో జన్మించి నష్టపోతున్నామన్న భావన హిందువుల్లో కలుగుతోందని అభిప్రాయపడ్డారు. మతప్రాతిపదికన సంక్షేమ పథకాలను అమలు చేయకూడదని కోరారు. దీనికి సమాధానంగానే ఎన్‌సీఎం ప్రమాణ పత్రాన్ని సమర్పించింది.