Bihar Rape Case : 15 ఏళ్ల మైనర్పై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెకు పురుగుల మందు తాగించారు. దీంతో బాధితురాలు స్పృహ తప్పి పడిపోయింది. నిందితులు ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు కూడా మైనర్లే అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన బిహార్.. వైశాలి జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల ఓ బాలిక తన అమ్మమ్మతో కలసి నివసిస్తోంది. బాలిక తల్లిదండ్రులు పట్నాలో ఉంటున్నారు. గురువారం రాత్రి బాలిక.. బహిర్భూమికి బయటకు వెళ్లింది. కాగా.. ఐదుగురు నిందితులు ఆమెను అక్కడినుంచి దగ్గర్లో ఉన్న మామిడి తోటలోకి ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు బాలికను చంపాలనుకున్నారు. అందులో భాగంగా పురుగుల మందు తాగించి అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాలిక.. తన అమ్మమ్మకు జరిగిన విషయం చెప్పి స్పృహతప్పి పడిపోయింది. దీంతో బాధితురాలికి ప్రథమ చికిత్స చేసి.. అంబులెన్సులో హాజిపుర్ సర్దార్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత పట్నాలో ఉన్న బాధితురాలి తల్లిదండ్రులు గ్రామానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.