UP gang rape news: ఉత్తర్ప్రదేశ్లో 13ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బుధవారం జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినా.. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించలేదు. చిత్రకూట్ జిల్లాలోని పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక నివసిస్తోందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి బయట నిద్రిస్తుండగా.. ఆమెపై అత్యాచారం జరిగిందని చెప్పారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు శనివారం స్పష్టం చేశారు. వీరిని నదీమ్, ఆదర్శ్ పాండే, విపుల్ మిశ్రగా గుర్తించారు.
అయితే, ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాలిక మరణించినా.. ఎవరికీ చెప్పలేదు. ముందుగా, చికిత్స కోసం ఆమెను కౌశంబి జిల్లాకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి బాలిక అక్కడే మరణించింది. గుట్టుచప్పుడు కాకుండా శుక్రవారం బాలిక మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇలా ఎందుకు చేశారనే విషయంపై కుటుంబ సభ్యులను ప్రశ్నించనున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వేచిచూస్తున్నట్లు చెప్పారు.
Rajasthan Girl murder:రాజస్థాన్లో తొమ్మిదేళ్ల బాలికను గొంతుకోసి చంపారు దుండగులు. ఆమేర్ ప్రాంతంలో శనివారం జరిగిందీ ఘటన. శనివారం మధ్యాహ్నం నుంచి బాలిక ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. ఆదివారం దడాబాదీ ప్రాంతంలో శవమై తేలింది. ఎవరూ లేని ప్రాంతంలో బాలిక మృతదేహం నగ్నంగా కనిపించిందని పోలీసులు తెలిపారు. అత్యాచారం చేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం రిపోర్ట్ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. బాలిక మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఫోరెన్సిక్ నిపుణులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
Gang rape in Rajasthan: ఇదే రాష్ట్రంలోని భరత్పుర్లో టీనేజర్పై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఓ మైనర్పై నెలలో ఆరుసార్లు అత్యాచారం చేశారు. నిందితులకు ఇద్దరు మహిళలు సహకరించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు.