మధ్యప్రదేశ్ రీవాలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్లు సహా మొత్తం ఆరుగురు కామాంధులు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రీవా జిల్లా ప్రధాన కార్యాలయానికి 70 కిలోమీటర్ల దూరంలోని నైగర్హి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిందీ ఘటన. మరోవైపు ముగ్గురు నిందితుల అక్రమ భవన నిర్మాణాల్ని కూల్చివేసింది జిల్లా యంత్రాంగం. నేరంలో పాల్గొన్న మరో ముగ్గురు విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
బాధితురాలు తన స్నేహితుడితో కలిసి శనివారం మధ్యాహ్నం ఆలయానికి వెళ్లింది. అయితే ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో నలుగురు వ్యక్తులు సహా ఇద్దరు మైనర్లు అక్కడికి వచ్చారు. బాలిక స్నేహితుడిపై దాడి చేసి ఆమెను సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు వదిలిపెట్టమని వేడుకున్నా నిందితులు కనికరించలేదు. బాలికపై అత్యాచారం అనంతరం ఆమెను తీవ్రంగా కొట్టి మొబైల్ సహా విలువైన సామగ్రి పట్టుకుని పరారయ్యారు. అనంతరం బాలికను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
హత్యచేసి ఇంటి పెరట్లో..:ఛత్తీస్‌గఢ్ రాయగఢ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ప్రియురాలిని హత్య చేసి తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాధితుడి ఇంటి పెరట్లో పాతిపెట్టిన శవాన్ని వెలికితీశారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..నిందితుడు ఖగేశ్వర్, బాధితురాలు కాంతి యాదవ్‌లు కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ అంతకుముందే వేర్వేరుగా పెళ్లిలు జరిగాయి. కానీ ఇద్దరూ తమ కుటుంబాల్ని విడిచిపెట్టి సహజీవనం సాగిస్తున్నారు. కాంతికి ఇద్దరు కుమారులు కాగా.. ఖగేశ్వర్‌కు నలుగురు పిల్లలు. ఖగేశ్వర్.. భార్య, పిల్లల్ని జశ్పుర్లో విడిచిపెట్టి వచ్చి.. 2018 నుంచి కాంతితో కలిసి జీవిస్తున్నాడు.
బాధితురాలి ఫోన్ 17 రోజులుగా స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో ఆమె ప్రియుడు ఖగేశ్వర్పై బాధితురాలి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. కంకూరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖగేశ్వర్ను.. బాధితురాలి తండ్రి తన కుమార్తె గురించి ప్రశ్నించాడు. అతడు దురుసుగా సమాధానం చెప్పేసరికి బాధితురాలి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఈ విషయం బాధితురాలి అక్కకు తెలిసింది. దీంతో ఆమె నిందితుడి ఇంటికి వెళ్లేసరికి అసలు విషయం బయటపడింది.