Minor Girl Carried Father On Rickshaw in Odisha :గాయపడిన తండ్రిని రిక్షా తొక్కుతూ 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది 14 ఏళ్ల కుమార్తె. ఒడిశా.. భద్రక్ జిల్లాలో అక్టోబర్ 22న జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదీ జరిగింది..
జిల్లాలోని దుసూరి నడిగావ్ ప్రాంతానికి చెందిన శంభునాథ్ సేథి అనే వ్యక్తి అక్టోబర్ 22న గాయపడ్డాడు. వాహనంలో ఆస్పత్రికి వెళ్లడానికి డబ్బులు లేక.. అతడి 14 ఏళ్ల కుమార్తె శంభునాథ్ను రిక్షాపై ధామ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం అదే రిక్షాపై 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న భద్రక్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే శంభునాథ్కు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో చేసేదేమీ లేక రిక్షాలో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఆస్పత్రి నుంచి రెండు కిలో మీటర్లు ప్రయాణించాక.. బాలిక రిక్షా తొక్కడాన్ని కొందరు విలేకరులు గమనించారు. అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న భద్రక్ ఎమ్మెల్యే, ధామ్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ఘటనా స్థలికి చేరుకుని.. బాధితుల పరిస్థితి తెలుసుకున్నారు. అనంతరం బాలిక తండ్రి చికిత్సకు, ఆస్పత్రిలో వారి బసకు ఏర్పాట్లు చేశారు.