ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో కరోనా కర్ఫ్యూ ఉల్లంఘించాడని పోలీసులు ఓ బాలుడిని చితకబాదారు. మరుసటి రోజునే ఆ బాలుడు మృతి చెందటం కలకలం సృష్టిస్తోంది. పోలీసుల దెబ్బలకే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఓ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన అధికారులు, మరో హోం గార్డును విధుల నుంచి తొలగించారు.
ఠాణాకు తీసుకెళ్లి మరీ..
బంగార్ మావ్లోని తన ఇంటి బయట బాలుడు కూరగాయాలు విక్రయిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. "కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించాడనే ఆరోపణలపై అతడిని పోలీసులు లాఠీతో కొట్టారు. అనంతరం పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి మరోసారి చితకబాదారు. దీంతో అతడి పరిస్థితి విషమించింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధరించారు" అని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పోలీసుల చర్యపై ఆగ్రహించిన స్థానికులు లఖ్నవూ రోడ్ క్రాసింగ్ వద్ద ఆందోళన చేపట్టారు. దోషులను వెంటనే శిక్షించాలని, బాధిత కుటుంబానికి ఓ ప్రభుత్వ ఉద్యోగం సహా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి, సంబంధిత పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:మతి పోగొట్టే మానవత్వం!