మైనర్‌ను కొట్టి.. చీర కట్టించిన గ్రామస్థులు స్త్రీలాగా వేషధారణ మార్చుకోవాలని మైనర్‌ను బలవంతం చేశారు కొందరు గ్రామస్థులు. 'గాగ్రా-చున్నీ' బట్టలు వేసి గాజులు తొడిగారు. రాజస్థాన్ సికర్ జిల్లా పటాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నీమ్కాథానా టౌన్లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బాలుడిని చితకబాదిన గ్రామస్థులు ఇదీ జరిగింది..
గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడని.. నీమ్కాథానా టౌన్ వారు తమ మనిషిని బందీ చేశారని బాధితుడి సోదరుడు ఆరోపించాడు. తీవ్రంగా కొట్టి.. తన సోదరుడికి చీరకట్టించారని పటాన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 10-15మంది ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేశారని పేర్కొన్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత.. బాధితుడిని వదిలేసేందుకు కొంత డబ్బు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపాడు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధితుడి సోదరుడు జూన్ 7న కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మైనర్‌ను కాపాడినట్లు పేర్కొన్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:వింత ప్రేమకథ- పదేళ్లుగా ఒకే గదిలో యువతి