Vaishno Devi Temple: యువకుల మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగానే.. వైష్ణో దేవీ ఆలయంలో తొక్కిసలాట జరిగిందని అన్నారు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్. దురదృష్టవశాత్తు 12 మంది మరణించారని తెలిపారు. పోలీసులు అధికారులు కలిసి అప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దారని స్పష్టం చేశారు.
దిల్బాగ్ సింగ్.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భక్తుల సంఖ్యను పరిమితం చేసే విషయంపై చర్చించినట్లు వెల్లడించారు.
ఘటనా స్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ''ప్రాథమిక సమాచారం ప్రకారం.. యువకుల మధ్య చిన్న గొడవ జరిగింది. ఇదే తొక్కిసలాటకు దారితీసింది. పోలీసులు, అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించాం.''
- దిల్బాగ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ
మొత్తం 15 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
Vaishno Devi Stampede: ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ అధికార యంత్రాంగంతో.. కేంద్రం టచ్‌లోనే ఉందని, పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించారు మోదీ.
Parties in J-K Express Grief
ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై జమ్ముకశ్మీర్లని పలు రాజకీయ పార్టీలు విచారం వ్యక్తం చేశాయి.
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా.. ఇదో విషాదకర ఘటనగా అభివర్ణించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎన్సీ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణే కారణం..
తొక్కిసలాట ఘటన అనంతరం.. వైష్ణో దేవీ యాత్ర సజావుగానే సాగుతున్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. కొవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ.. యాత్రికులు దర్శనం చేసుకుంటున్నట్లు వివరించారు.
రెండు వర్గాల మధ్య గొడవే తొక్కిసలాటకు కారణమని ప్రకటించింది వైష్ణో దేవీ ఆలయ బోర్డు. డిసెంబర్ 21, జనవరి 1 మధ్య 50 వేలమందికి అనుమతి ఉండగా.. 35 వేల మందిని మాత్రమే అనుమతించినట్లు స్పష్టం చేసింది.
ఈ ఘటనపై విచారణకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు.. ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉండే ఈ కమిటీలో.. జమ్మూ డివిజనల్ కమిషనర్ రాఘవ్ లాంగర్, అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ ఉంటారు.
వారంలోపే ఈ ఘటనపై కమిటీ.. తన నివేదికను సమర్పిస్తుందని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తెలిపింది.
12 మంది మృతి..
కొత్త సంవత్సరం వేళ జమ్ముకశ్మీర్ మాతా వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు మరణించారు. పూజల నిమిత్తం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. క్షతగాత్రులను పోలీసులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా భక్తులు రావడం వల్ల సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ను నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆలయ బోర్డు తెలిపింది.
ఇవీ చూడండి:తొక్కిసలాటలో 12మంది మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు
మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట- 12మంది మృతి