పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu resignation) ప్రకటించగానే.. పార్టీలోని పలువురు నేతలు సైతం తమ పదవులను వదులుకుంటున్నట్లు వెల్లడించారు.
కేబినెట్ మంత్రులుగా ఉన్న పర్గాత్ సింగ్, రజియా సుల్తానాలు తన రాజీనామాను ముఖ్యమంత్రికి పంపించారు. సిద్ధూ సిద్ధాంతాలను పాటించే వ్యక్తి అని, పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసమే ఆయన పోరాడుతున్నారని రజియా సుల్తానా పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయనతో పాటే నడవాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
అదేసమయంలో పంజాబ్ పీసీసీ కోశాధికారి గుల్జార్ ఇందర్ చాహల్, ప్రధాన కార్యదర్శి యోగిందర్ ధింగ్రా, ఇంఛార్జి ప్రధాన కార్యదర్శి గౌతమ్ సేత్ సైతం పార్టీ పదవులకు రాజీనామా చేశారు. సిద్ధూ నిర్ణయానికి సంఘీభావంగానే తాము రాజీనామా చేసినట్లు తెలిపారు.
అధిష్ఠానం నో..
కాగా, సిద్ధూ రాజీనామాను పార్టీ అధిష్ఠానం ఆమోదించలేదు. సమస్యను ముందుగా రాష్ట్ర స్థాయిలో పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని కాంగ్రెస్ అగ్రనేతలు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.