Talasani Srinivas Respond on Girl Died Falls in Nala: హైదరాబాద్లోని కళాసిగూడలో నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన బాలిక కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. చిన్నారి మౌనిక మృతి అత్యంత బాధాకరమన్నారు. పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్తుండగా కింద పడిన తన సోదరుడిని కాపాడే ప్రయత్నంలో చిన్నారి నాలాలో పడిపోయినట్లు తలసాని తెలిపారు. మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమ్మాయి చనిపోవడం ఎంతగానో కలచివేసిందని అన్నారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారాన్ని అందిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
'ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమాన్ని కేటీఆర్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వాల పాపాలను ప్రస్తుత ప్రభుత్వం మోయాల్సి వస్తోంది. రూ.10 కోట్లు ఖర్చు పెట్టి కళాసిగూడ నాలాను అభివృద్ధి చేస్తున్నాం. గతంలోనూ వరదలు వచ్చినప్పుడు ఇంటింటికీ రూ.10వేల చొప్పున రూ.650 కోట్లను పరిహారంగా అందించాం. సానుభూతి కోసం పనికిరాని మాటలు.. బాధ్యత గల వ్యక్తులు మాట్లాడొద్దు. ప్రభుత్వంపై విమర్శలు చేసే నేతలు వారేం చేశారో కూడా చెబితే బాగుంటుంది. జీతాలకు డబ్బులు లేవని ఎవరు చెప్పారు? నాలుగేళ్ల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఏం చేశారు?'-తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ మంత్రి
నాలాలపై చేపట్టిన నిర్మాణాల వల్లే ఇలాంటి సమస్యలు:తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.590 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. భారీ వర్షాలు పడితే ఎక్కడెక్కడ వరద వస్తుందో.. అలాంటి నాలాలను ఈ నిధులతో బాగు చేస్తున్నామన్న తలసాని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను ఈ ప్రభుత్వం మోయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నాలాలపై చేపట్టిన నిర్మాణాల వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన తెలిపారు. బల్దియా పనిచేయడం లేదు.. మున్సిపల్ సిబ్బంది కనిపించడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారని తలసాని ధ్వజమెత్తారు. ఇదే నిజమైతే ఇవాళ ఇంటింటికీ నీరు, కరెంటు ఎలా వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.