Congress Efforts to bind Minister Srinivas Goud :ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మహబూబ్‌నగర్. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయదుందుభి మోగించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. హ్యాట్రిక్ విజయం దక్కించుకునే దిశగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. పదేళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధినే ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నారు. కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్, ఐటీ పార్క్, అమర్‌రాజా పరిశ్రమ(Amar raja Industry), 1000 పడకల ఆసుపత్రి, శిల్పారామం, మినిట్యాంక్ బండ్, నెక్లెస్‌రోడ్డు, తీగలవంతెన, కూడళ్ల సుందరీకరణ, నిరంతర తాగునీరు, మౌలిక వసతుల కల్పన వంటి పనులను ప్రజలకు వివరిస్తున్నారు.
మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో.. కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతోంది. అభ్యర్ధి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి.. ఆరు గ్యారంటీలతోపాటు, మంత్రి వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఆరాచకాలు, అక్రమ కేసులకు చరమగీతం పాడాలంటే హస్తానికి ఓటు వేయాలని కోరుతున్నారు. మహబూబ్ నగర్ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించడానికి తామంతా ఇక్కడ పూనుకున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల హక్కులను ధ్వంసం చేస్తున్న వారిపై యుద్ధంగా అసెంబ్లీ ఎన్నికలను సంబోధించారు.
Mahabubnagar Political Parties Strategy : బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి..అమృత్ సిటీ కింద మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తానంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. పదేళ్ల అభివృద్ధి శ్రీనివాస్‌గౌడ్‌కు బలమైతే.. ఆయనపై వస్తున్న ఆరోపణలు ప్రతికూల అంశాలుగా మారాయి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు(Congress Six Guarantee), ఎమ్మెల్యేగా గతంలో చేసిన సేవలు.. యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి సానుకూలం కాగా.. ఎన్నికలప్పుడు తప్ప మళ్లీ కనిపించరన్న విమర్శ ప్రతికూలంగా మారింది.