Udaipur Murder: రాజస్థాన్ ఉదయ్పుర్లో జరిగిన దారుణ హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చెలరేగకుండా రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. వెంటనే అంతర్జాల సేవలు నిలిపివేసింది. ముందు జాగ్రత్త చర్యగా 30 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. కేసు విచారణను అత్యంత వేగంగా చేపట్టింది. ఇద్దరు ప్రధాన నిందితులను ఘటన జరిగిన రెండు మూడు గంటల్లోపే అరెస్టు చేసింది. ఆ మరునాడే వారితో సంబంధం ఉన్న మరో ముగ్గురిని అరెస్టు చేసింది. అయితే ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్న ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పాకిస్థాన్‌తో సంబంధాలు:భారత్‌లో ఎప్పుడు ఉగ్రవాద ఘటనలు జరిగినా పాకిస్థాన్‌తో సంబంధాలు ఉండటం సాధారణంగా మారింది. ఇప్పుడు ఉదయ్పుర్లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్యకు కూడా పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితుల్లో ఒకడైన గౌస్ మహమ్మద్‌కు పాకిస్థాన్‌తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు రాజస్థాన్ హోంమంత్రి రాజేంద్ర యాదవ్ వెల్లడించారు. అతడు 2014-15లో కరాచీలో 45 రోజుల పాటు ఉగ్రశిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2018-19లో అరబ్ దేశాలకు కూడా వెళ్లినట్లు చెప్పారు. గతేడాది నేపాల్‌లో ఉన్నట్లు తెలిసిందన్నారు.
ఈ హత్యకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు తెలియడం వల్ల కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్ఐఏ) అప్పగించింది రాజస్థాన్ ప్రభుత్వం. వెంటనే దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ బృందానికి ప్రాథమిక విచారణలో నిందితులకు సంబంధించి కీలక విషయాలు తెలిశాయి. ఇద్దరు నిందితులు గౌస్ మహమ్మద్, రియాజ్ అక్తర్‌కు పాకిస్థాన్‌తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు తేలింది. వారిద్దరూ పాకిస్థాన్‌లో ఉన్నవారితో తరచూ మాట్లాడుతున్నట్లు వెల్లడైంది. రియాజ్ అక్తర్‌కు అనుమానిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. పాకిస్థాన్ సంస్థ 'దావత్-ఎ-ఇస్లామీ'తో రిజాయ్కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోందని దర్యాప్తు అధికారిక వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నర్ సల్మాన్ తసీర్ హత్య సహా అనేక ఇతర ఉగ్రవాద సంఘటనలకు ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన కొంతమంది సభ్యులను గుర్తించినట్లు సమాచారం.