KTR Comments on Vishaka Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసం బిడ్డింగ్, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదానీ కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. 2018 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్ బైలదిల్లా ఐరన్‌ఓర్ కంపెనీ పెట్టిందన్న ఆయన.. అక్కడి నుంచి గుజరాత్‌లోని ముంద్రాకు తరలించేలా ప్రణాళిక చేశారని తెలిపారు. ఈ కేటాయింపు ద్వారా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు లేకుండా... విశాఖ ఉక్కును లేకుండా చేయాలనే కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
నష్టాలు జాతికి అంకితం.. లాభాలు దోస్తులకు ఇవ్వటం : విశాఖ ఉక్కు పరిశ్రమను కావాలనే నష్టాల్లోకి నెట్టారన్న కేటీఆర్.. నష్టాలు చూపించి చౌకగా తన మిత్రులకు విక్రయించటం మోదీ విధానమని విమర్శించారు. ప్రధాని అదానీ కలిసి తెలుగు రాష్ట్రాల సంపదను కొల్లగొడుతున్నారని నిర్దిష్ఠమైన ఆధారాలతో చేస్తున్న ఈ ఆరోపణ తప్పని నిరూపిస్తే... పరువునష్టం దావా ఎదుర్కొనేందుకైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. బైలాదిల్లాలో 1.34 బిలియన్ టన్నుల ఐరన్ ఓర్ లభిస్తుందన్న కేటీఆర్... అక్కడి నుంచి బయ్యారానికి 50శాతం పైపులైన్ ఖర్చు భరిస్తామని చెప్పినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. బయ్యారంలో పరిశ్రమ సాధ్యం కాదంటూ తిరస్కరించారని విమర్శించారు. నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను దోస్తులకు అంకితం చేయటం మోదీ విధానమని విమర్శించారు. రాజకీయాల కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ అనేది అవాస్తవమని స్పష్టం చేశారు.