Minister Harishrao in GST Council Meeting : జీఎస్టీ వసూళ్లపై తెలంగాణకు పరిహారం కింద రూ.698.97 కోట్లు తెలంగాణకు రావాల్సి ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన.. జీఎస్టీ బకాయిలు, ఇతర రాష్ట్రాల పేరుతో నమోదు చేసిన వాణిజ్య సంస్థల పన్ను చెల్లింపుల తీరు గురించి ప్రత్యేకంగా వివరించారు. వెనుకబడిన జిల్లాల నిధి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉందని... రూ.1,350కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్ సమస్య పరిష్కారానికి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు హరీశ్‌రావు తెలిపారు.
రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయండి : తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలను సమన్యాయంతో పంపిణీ చేసేందుకు కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కుమంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. నిన్న రాత్రి దిల్లీలోని షెకావత్ నివాసానికి వెళ్లి కలిసిన హరీశ్‌రావు... రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నదీ జలాల వాటా, అనుమతులపై చర్చించారు. ‘కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించారని.... కొత్త ట్రైబ్యునల్ పరిధిని కృష్ణా జలాల పంపిణీ వరకే పరిమితం చేయాలన్నారు. గోదావరి నదిపై సీతారామ ఎత్తిపోతల పథకం, సమ్మక్కసాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం మూడో టీఎంసీ, అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను కేంద్ర జల సంఘానికి పంపించామని... సాధ్యమైనంత త్వరగా వాటిని ఆమోదించాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 90 టీఎంసీల నికర జలాలు కేటాయిస్తూ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించినట్లు కేంద్ర మంత్రికి విన్నవించారు.