Mining Irregularities in AndhraPradesh: ఆంధ్రప్రదేశ్‌లో గనుల శాఖను కబ్జా చేశారు. దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారు. ప్రభుత్వ వ్యవస్థను సర్వనాశనం చేసి, ప్రైవేటు వ్యక్తులకు దాసోహం చేశారు. చట్టాన్ని చుట్టంగా చేసుకుని, నిబంధనల నడ్డి విరిచేసి రాష్ట్ర నలుమూలలా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. ఇసుక, సిలికా, క్వార్ట్జ్ సహా... ఖనిజమేదైనా అడ్డంగా కొల్లగొడుతున్నారు. నిజాయతీపరులైన అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించి , గంగిరెద్దుల్లా తలూపే వారికి పెద్దపీట వేస్తూ గనులను దిగమింగుతున్నారు. తవ్వకాలు ఆపాలన్న ఎన్జీటీ సుప్రీంకోర్టు ఆదేశాలనూ పెడచెవిన పెట్టి బకాసురుల్లా భోంచేస్తున్నారు. ఏపీలో విశృంఖలంగా సాగుతున్న గనుల దోపిడీపై ఈటీవీ భారత్ - ఈనాడు పరిశీలనాత్మక కథనం.
ఎన్జీటీ సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖారతు:సహజ వనరుల్ని చెరబట్టడంలో, ప్రకృతి సంపదను దోచేయడంలో వైఎస్సార్సీపీ బడానేతల్ని కొట్టేవాళ్లే లేరు. ప్రభుత్వంలో నెంబర్-2గా చెలామణి అవుతున్న పెద్దాయనది దోపిడీలో అందెవేసిన చెయ్యి. ప్రభుత్వశాఖలో మంత్రి, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉండాలన్న సహజ నిబంధనలు పక్కనబెట్టి అనుచరులు, బినామీలు, సన్నిహిత కాంట్రాక్టర్లకు అడ్డాగా కొత్తరూపునిచ్చారు. ప్రభుత్వానికి అధికాదాయం తెచ్చేఖనిజ సంపదను సొంత ఆస్తిలా మింగేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లాభసాటి గనులను నయానో, భయానో లాగేసుకున్నారు. అధికాదాయం వచ్చేవన్నీ పెద్దాయన గుప్పిట పట్టగా, మిగతా గనుల్ని అనుచరులు పంచేసుకున్నారు. పర్యావరణ అనుమతులు లేకపోయినా, తవ్వకూడదన్న ఎన్జీటీ సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖారతు చేస్తూ, విశృంఖలంగా ఇసుక తవ్వేస్తున్నారు. ఇసుకలో ఏటా ప్రభుత్వానికి 760 కోట్ల ఆదాయం వస్తే... ప్రభుత్వ పెద్దలు మాత్రం వెయ్యి కోట్లకుపైగా కొల్లగొడుతున్నారు. ప్రభుత్వంలోని పెద్ద తలకాయ అండతో ఈ దోపిడీరాజ్‌కు ఎదురులేకుండా పోయింది.
సోమిరెడ్డి దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత - అల్లరి మూకలు చేరి
నిబంధనలను పాతాళానికి తొక్కేసి: లీజుదారులు తవ్విన ఖనిజానికి పర్మిట్ల జారీ, ఖనిజాన్ని అక్రమంగా తరలించకుండా పర్యవేక్షించడం గనులశాఖ బాధ్యత. ఇప్పుడు దాన్నీ ప్రైవేటుపరం చేశారు. జిల్లాల వారీగా అస్మదీయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టేశారు. దేశం మొత్తమ్మీద రాజస్థాన్‌లో మాత్రమే ఈ విధానం ఉంది. అదికూడా గ్రానైట్, మార్బుల్‌కు మాత్రమే. దాన్ని బూచిగా చూపించి జగన్ ప్రభుత్వం అన్నిరకాల గనులకు రాజస్థాన్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే 7 ఉమ్మడి జిల్లాల్లో సీనరేజి వసూళ్లను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసింది. మట్టి, కంకర మొదలు చిన్నతరహా ఖనిజాల సీనరేజి వసూళ్లన్నింటినీ అప్పనంగా అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ పొందిన సంస్థల్లో ప్రస్తుత తెలంగాణ మంత్రి, గతంలో ఖమ్మం నుంచి వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీతో పాటు, పెద్దాయన సన్నిహితుల సంస్థలూ ఉన్నాయి. వీళ్లంతా నిబంధనలను పాతాళానికి తొక్కేసి, గనులశాఖ అధికారుల్ని ఖాతరు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గనులశాఖలో కంప్యూటరైజ్డ్ పర్మిట్ల విధానాన్ని మార్చేసి... చేతిరాతతో పర్మిట్‌లు ఇస్తున్నారు. నెలవారీ రాబడి వివరాల్ని కూడా గనులశాఖ అధికారులకు ఇవ్వడం లేదు. ఇసుక తవ్వకాలు, విక్రయాలపై గుత్తేదారులు చెప్పిన లెక్కలే అధికారులు రాసుకోవాల్సి వస్తోంది. కనీసం ఇసుక తవ్వుతున్న ప్రాంతానికెళ్లి పరిశీలించే ధైర్యం కూడా అధికారులకు ఉండటం లేదు. ప్రతినెలా వచ్చే రాబడి వివరాలు ఇవ్వడం కుదరని, మూణ్నాలుగు నెలలకోసారి ఇస్తామని తెగేసి చెప్పేశారు.
అడుగులకు మడుగులొత్తే అధికారులు: పెద్దాయన కనుసైగ లేకుండా గనుల శాఖలో చిన్న పని కూడా జరగదు. లీజుల కేటాయింపు, రెన్యువల్ దస్త్రాలు, అధికారుల బదిలీలు... ఇలా ఏదైనా ఆయన మాట మేరకు జరగాల్సిందే. గనులశాఖ డైరెక్టర్ మొదలు, పేషీలో సహాయకులుగా ఎవరుండాలన్నదానిపై ఆయన నిర్ణయమే ఫైనల్. అడుగులకు మడుగులొత్తే అధికారుల్ని కీలక స్థానాల్లో కూర్చోబెట్టి, బినామీల్ని సామంతులుగా పెట్టుకుని దందా నడిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా, ఇన్‌ఛార్జ్ సంచాలకుడిగా రామ్‌గోపాల్ ఉండేవారు. పెద్దాయన కన్నెర్రజేయడంతో కొన్ని నెలలకే బదిలీ చేశారు. సొంత నిర్ణయంతో 5 గ్రానైట్ లీజులివ్వడమే రామ్‌గోపాల్ నేరమైంది. ఆయన్ను బదిలీ చేశాక... అప్పటి పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదికి గనులశాఖ ముఖ్యకార్యదర్శి ఇన్‌ఛార్జి బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పటికి నాలుగేళ్లవుతున్నా రెగ్యులర్ ముఖ్య కార్యదర్శిని నియమించకుండా, ద్వివేదితోనే నడిపిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అన్నిశాఖల ముఖ్య కార్యదర్శులను బదిలీ చేశారు. ద్వివేదిని పంచాయత్‌రాజ్‌శాఖ నుంచి వ్యసాయశాఖకు మార్చారు. అయినా గనులశాఖ ఇన్‌ఛార్జిగా మాత్రం ఆయన్నే కొనసాగిస్తున్నారు. పెద్దాయన మాట, ప్రభుత్వంలో కీలక పెద్దల ఆదేశాలను ద్వివేది జవదాటరని,అందుకే కొనసాగిస్తున్నారన్న చర్చ బలంగా ఉంది.