Milma And Nandini Issue : కేరళ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్- మిల్మా పేరిట ఆ రాష్ట్రంలో పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. నందిని పేరిట పాలు, ఇతర ఉత్పత్తులను విక్రయించే కర్ణాటక మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కేరళలో పలుచోట్ల ఔట్‌లెట్లు తెరవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లక్షలాది మంది పాడి రైతుల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన సహకార వ్యవస్థకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని మిల్మా ఆరోపించింది. కొన్ని రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర పాల సహకార సంఘాలు తమ రాష్ట్రాల పరిధులను దాటి ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇది సమాఖ్య, సహకార స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని, సహకార స్ఫూర్తికి ప్రాణం పోసిన త్రిభువన్‌దాస్, వర్గీస్ కురియన్ వంటి మహానుభావుల ఆదర్శాలకు వ్యతిరేకమని మిల్మా ఛైర్మన్ కేఎస్ మణి పేర్కొన్నారు.
కర్ణాటకలో అమూల్ పాల ఉత్పత్తులను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో నందిని బ్రాండ్‌ను ప్రమోట్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని కేరళ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ మణి ప్రశ్నించారు. ఈ ధోరణి రాష్ట్రాల మధ్య అనారోగ్యకర పోటీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని అభిప్రాయపడ్డారు. పాల సహకార సంఘాలు తమ రాష్ట్రాల పరిధి దాటి వేరే రాష్ట్రాల్లో పాల ఉత్పత్తులు విక్రయించకూడదన్న ఒప్పందాన్ని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లో ఔట్‌లెట్లు ప్రారంభించటం మానుకోవాలని నందిని బ్రాండ్‌కు సూచించారు. ఇతరరాష్ట్రాలతో పోలిస్తే కేరళలో పాల సేకరణ ఖర్చు అధికంగా ఉందని, వార్షిక లాభాల్లో 83 శాతం పాడి రైతులకు వివిధ రూపాల్లో తిరిగి చెల్లిస్తున్నామని మిల్మా ఛైర్మన్ మణి పేర్కొన్నారు.
కర్ణాటకలో అమూల్ వర్సెస్ నందిని..
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల సమీపిస్తున్న వేళ మరో అమూల్, నందినిల పేరుతో వివాదం రాజుకుంది. కర్ణాటక పాల సమాఖ్య ఆధ్వర్యంలోని నందిని పాల ఉత్పత్తులకు పోటీగా గుజరాత్‌కు చెందిన ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ ఆ రాష్ట్రంలో తమ ఔట్లెట్లను పెట్టేందుకు అనుమతులతో ముందుకొచ్చింది. ఈ పరిణామం గత కొద్ది రోజులుగా అక్కడి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.