Millionaire Thief Arrested :ఆయనో హోటల్‌కు యజమాని. అనేక కోట్లు విలువైన ఆస్తులు ఆయన సొంతం. ఇవే కాకుండా ఈ ఆస్తుల ద్వారా నెలకు దాదాపు రూ.2లక్షలు అద్దెలు కూడా వస్తాయి. ఇవన్నీ చూస్తే ఎంతో ఆయనో ఉన్నతమైన వ్యక్తి అన్న భావన అందరిలోను కలుగుతోంది. ఆయన కుటుంబ సభ్యులు సైతం అదే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆయన ఇవన్నీ ఎలా సంపాదించాడో తెలిసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఓ పక్క నిజాయితీగా కనిపిస్తున్న ఈయన.. ఇప్పటివరకు దాదాపు 200కు పైగా దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ విషయం కనీసం భార్యకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాకు చెందిన మనోజ్ చౌబే కుటుంబం.. నేపాల్‌లో స్థిరపడింది. అతడు 1997లో దిల్లీకి వలస వచ్చాడు. అక్కడే కీర్తినగర్‌లో ఓ క్యాంటీన్‌ను ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అనేక చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడి.. జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత పెద్ద ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అధిక మొత్తంలో దొంగతనం చేశాడు. దోచుకున్న సొమ్ముతో స్వగ్రామానికి వెళ్లి అక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు. ఈ సొమ్ముతో నేపాల్‌లో ఓ హోటల్‌ను నిర్మించాడు. ఆ తర్వాత యూపీ నీటిపారుదల శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తాను దిల్లీలో ఓ పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నానని.. అక్కడే ఉండాల్సి వస్తుందని భార్య సహా వారి కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఇలా ఏడాదిలో 8 నెలలు దిల్లీలోనే ఉండేవాడు. ఈ దొంగ సొమ్ముతో శోహరత్గఢ్ పట్టణంలో భార్య పేర ఓ గెస్ట్ హౌస్, లఖ్‌నవూలో మరో ఇల్లు కట్టాడు. అనేక స్థిరాస్తులు కొనుగోలు చేసి లీజ్‌కు ఇచ్చాడు. ఈ ఆస్తులతో దాదాపు అతడికి రూ.2లక్షలు అద్దె రూపంలో వస్తాయి. ఆ తర్వాత దిల్లీకి మకాం మార్చిన మనోజ్.. అక్కడ మరో వివాహం చేసుకున్నాడు.