తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రిపబ్లిక్ డే పరేడ్​లో బంగ్లాదేశ్ దళాలు - రిపబ్లిక్ డే న్యూస్

రాజ్​పథ్​లో జరిగే గణతంత్ర పరేడ్​లో సైన్యం కీలక ఆయుధాలను ప్రదర్శించనుంది. బంగ్లాదేశ్​కు చెందిన సాయుధ దళాలు కవాతులో పాల్గొననున్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న దృఢమైన బంధానికి ప్రతీకగా బంగ్లాదేశ్‌ బలగాలు ప్రదర్శన చేయనున్నట్లు సైనికాధికారులు పేర్కొన్నారు. మరోవైపు, సందర్శకుల అనుమతి నిబంధనలను ఈ ఏడాది దిల్లీ పోలీసులు కఠినతరం చేశారు.

Military contingent of B'desh excited to walk down Rajpath on 50th year of its Independence
రిపబ్లిక్ డే పరేడ్​లో బంగ్లాదేశ్ సాయుధ దళాలు

By

Published : Jan 24, 2021, 7:30 AM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాజ్​పథ్​లో జరిగే పరేడ్​లో కీలక సైనిక సంపత్తిని ప్రదర్శించేందుకు భారత ఆర్మీ సన్నద్ధమవుతోంది. అత్యాధునిక టీ-90 యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్‌ క్షిపణులను రిపబ్లిక్‌ పరేడ్‌లో సైనిక బలగాలు ప్రదర్శించనున్నాయి. వీటితో పాటు బీఎంపీ-2, పినాక బహుళ ప్రయోగ రాకెట్‌ వ్యవస్థ, ఎలక్ట్రానిక్‌ యుద్ధ పరికరాలు గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకోనున్నాయి.

బంగ్లాదేశ్‌కు చెందిన సాయుధ దళాల కవాతు, బ్యాండ్‌ బృందం తొలిసారి భారత గణతంత్ర వేడుకల్లో భాగం కానున్నాయి. ఇరుదేశాల మధ్య ఉన్న దృఢమైన బంధానికి ప్రతీకగా బంగ్లాదేశ్‌ బలగాలు ప్రదర్శన చేయనున్నట్లు సైనికాధికారులు పేర్కొన్నారు. మరోవైపు, సాయుధ దళాలు, పారా మిలటరీ దళాలు, దిల్లీ పోలీసులు, ఎన్​సీసీ, ఎన్​ఎస్ఎస్ బృందాలు రిపబ్లిక్‌ డే కవాతులో పాల్గొననున్నాయి. అయితే కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా ఈ సారి మోటార్‌ సైకిల్‌ ప్రదర్శన నిర్వహించట్లేదని అధికారులు తెలిపారు.

పరిమితంగా సందర్శకులు

రాజ్​పథ్​లో జరిగే కవాతును తిలకించేందుకు వచ్చే సందర్శకుల అనుమతి నిబంధనలను ఈ ఏడాది దిల్లీ పోలీసులు కఠినతరం చేశారు. ఆహ్వాన పత్రాలు, టికెట్లు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేదు.

వేడుకల ప్రత్యక్ష వీక్షణకు అనుమతి దొరకనివారంతా ఇళ్లలో ఉండి ప్రత్యక్ష ప్రసారాలు చూడాలని పోలీసులు ట్విటర్ ద్వారా సూచించారు. ఆహూతులు చేతిసంచులు, బ్రీఫ్ కేసులు, తినుబండారాలు, కెమెరాలు, బైనాకులర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వంటివి తీసుకురాకూడదని స్పష్టం చేశారు. రిమోట్ కంట్రోల్ ఉన్న కారు తాళాలు, మండే వస్తువులు, ప్లాస్కులు, నీళ్ల బాటిళ్లు, టాయ్ గన్స్ వంటివి కూడా కవాతు ప్రాంతానికి తీసుకురాకూడదని ఆంక్షలు విధించారు.

జనవరి 26న దిల్లీ మొత్తం నింగీ నేలా భద్రతాదళాలు కాపు కాస్తాయి. దిల్లీ శివారులో కొనసాగుతున్న రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని సరిహద్దుల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. గతేడాది 1.25 లక్షల ఆహుతులను అనుమతించగా.. ఈ ఏడాది 25 వేల మందిని మాత్రమే అనుమతిస్తారు. ఎన్ క్లోజర్ల సంఖ్య కూడా 19కి తగ్గించారు.

ABOUT THE AUTHOR

...view details