Kashmir Militant Attack : జమ్ముకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని గగ్రాన్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ముష్కరులు జరిపిన కాల్పుల్లో అన్వల్ థోకర్, హీరాలాల్, పాంటూ అనే ముగ్గురు వలస కార్మికులు గాయపడ్డారు. వీరంతా బిహార్‌లోని సుపౌల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీనగర్‌కు తరలించారు. అనంతరం.. దాడి జరిగిన ప్రాంతానికి చేరుకున్న భద్రతాబలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి.
ఈ ఘటనను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఖండించారు. 'ఇది చాలా దురదృష్టకరం. ఈ దాడిని నేను నిస్సందేహంగా ఖండిస్తున్నాను. గాయపడిన వారు పూర్తిగా, త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను' అని అబ్దుల్లా ట్వీట్ చేశారు.
'షోపియాన్ జిల్లా గగ్రాన్‌లో వలస కార్మికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కిరాణా వస్తువులు కొనడానికి వెళ్లిన నిరాయుధ కార్మికులపై భయంకరంగా దాడి చేయడం.. ఉగ్రవాదుల నిరాశ, అమానవీయత, చౌకబారుతనాన్ని ప్రతిబింబిస్తుంది' అని జమ్మూ కశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఠాకూర్ పోలీసులను కోరారు. గాయపడిన ముగ్గురు వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
Attack On Kashmiri Pandit : ఈ ఏడాది కశ్మీర్‌లో స్థానికేతరులు, మైనారిటీలపై దాడి జరగడం ఇది మూడోసారి. ఫిబ్రవరి 26న, దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అచెన్ ప్రాంతంలోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. మూడు నెలల తర్వాత మే 29న అనంత్‌నాగ్ పట్టణంలోని జగ్లాండ్ మండి సమీపంలోని ఓ అమ్యూజ్‌మెంట్ పార్కులో.. ప్రైవేట్ సర్కస్ మేళాలో పనిచేస్తున్న ఉదంపుర్ వాసి దీపును కాల్చి చంపారు.
క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్న దృశ్యాలు