Militants infiltrate to india: ఈ ఏడాది గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశంలోకి చొరబడేందుకు దాదాపు 135 మంది ముష్కరులు నియంత్రణ రేఖ వెంబడి(ఎల్ఓసీ) ఎదురుచూస్తున్నట్లు కశ్మీర్ బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజాబాబు సింగ్ వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం నాడు ముష్కరులు దాడులకు తెగబడే అవకాశాలున్నట్లు వచ్చిన హెచ్చరికల మేరకు సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.
Security at Line of Control: నిఘా వర్గాల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని జమ్ముకశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలు డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ బీఎస్‌ఎఫ్ విస్తృతమైన యాంటీ టన్నెలింగ్ డ్రైవ్, ప్రత్యేక పెట్రోలింగ్, డెప్త్ ఏరియా డామినేషన్‌ను నిర్వహిస్తోందని చెప్పారు. ప్రస్తుతం సరిహద్దు పరిస్థితులు శాంతియుతంగానే ఉన్నట్లు తెలిపారు.
"దేశంలో చొరబడేందుకు ఎల్ఓసీ వెంబడి పలు ప్రాంతాల్లో 104 నుంచి 135 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమచారం అందింది. కొందరు గైడ్‌లు నియంత్రణ రేఖ దాటి ఆ వైపునకు వెళ్లారు. వారు తిరిగి వచ్చినప్పుడు పర్యవేక్షిస్తాం. వారి కుటుంబాల కదలికల్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది" అని బీఎస్‌ఎఫ్ ఐజీ పేర్కొన్నారు.
చొరబాట్లకు వీలు లేకుండా అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంచినట్లు రాజాబాబు తెలిపారు. తాలిబన్లు చొరబడే ప్రమాదమున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. ఇప్పటివరకు దానిపై ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అయినప్పటికీ గట్టి నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. డ్రోన్ ముప్పు ఉన్నట్లు తెలిపారు. "గతేడాది కూడా డ్రోన్లను గుర్తించాం. కానీ ఎవరూ మన భూభాగంలోకి ప్రవేశించలేదు. ఈ ఏడాది తగిన చర్యలు తీసుకుంటున్నాం. యాంటీ డ్రోన్ విధానాలతో ద్వారా సమర్థంగా ఎదుర్కొంటాం" అని రాజాబాబు చెప్పారు.
ఇదీ చూడండి:'ఫిబ్రవరి 15 నాటికి దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం!'