Militants Gun Fight Manipur :జాతుల మధ్య వైరం కారణంగా గత ఏడు నెలలుగా అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది మరణించారు. తెంగ్నౌపాల్ జిల్లాలోని లితు గ్రామంలో సోమవారం జరిగిందీ ఘటన.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
Manipur Violence Latest News : "సోమవారం తెల్లవారుజామున తెంగ్నౌపాల్ జిల్లాలోని లితు గ్రామ సమీపం నుంచి ఓ తిరుగుబాటు బృందం మయన్మార్ వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న పలువురు ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో అవతలి వర్గం వారు కూడా కాల్పులు ప్రారంభించారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే అసోం రైఫిల్స్ బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. 13 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. కాల్పుల ఘటనలో మృతి చెందిన వారు ఏ వర్గానికి చెందిన వారనేది తెలియాల్సి ఉంది. మృతుల్లో స్థానికులు ఎవరూ లేరు" అని స్థానిక అధికారి వెల్లడించారు.
తిరుగుబాటు గ్రూపుతో శాంతి ఒప్పందం
కొద్దిరోజుల క్రితం శాంతి పునరుద్ధరణలో భాగంగా తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF) వర్గంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఆదివారం తెంగ్నౌపాల్ జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో కుకీ-జో గిరిజన వర్గాలు ఈ శాంతి ఒప్పందాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేశాయి. దీంతో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు మినహా రాష్ట్రమంతా ఇంటర్నెట్ సేవలను మణిపుర్ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది.