Milind Deora Resignation :భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం రోజే కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత, కేంద్ర మంత్రి మాజీ మిలింద్ దేవరా ఆదివారం కాంగ్రెస్‌ను వీడి శివసేనలో చేరారు. ముంబయిలో ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే సమక్షంలో శివసేనలో చేరారు. కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
"ఒకప్పుడు ఆ పార్టీ దేశం కోసం నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేది. కానీ ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చెప్పినా, చేసినా వ్యతిరేకంచాలన్నది మాత్రమే ఆ పార్టీ ఏకైక లక్ష్యం. ఒకవేళ కాంగ్రెస్ మంచి పార్టీ అని ఆయన(మోదీ) చెప్పినా వారు వ్యతిరేకిస్తారు. నేను GAIN(G-అభివృద్ధి, A-ఆకాంక్ష, I-సమ్మిళిత, N-జాతీయవాదం)తో కూడిన రాజకీయాన్ని మాత్రమే నమ్ముతాను. PAIN(PA-వ్యక్తిగత దాడులు, I-అన్యాయం, N-నెగెటివటీ) రాజకీయాలను నమ్మను.
కేంద్రంలో, రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం అవసరం. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇప్పుడు భారత దేశం సుదృఢంగా మారడం మనందరికీ గర్వకారణం. గత 10 ఏళ్లలో ముంబయిలో ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు. ఇది ముంబయివాసులకు గొప్ప విజయం" అని అన్నారు మిలింద్ దేవరా.
55 ఏళ్ల బంధానికి తెర
అంతకుముందు కాంగ్రెస్‌కు రాజీనామాపై కీలక ప్రకటన చేశారు మిలింద్. " నా రాజకీయ ప్రయాణంలో కీలక అధ్యాయం ఇప్పుడు తుది ఘట్టానికి చేరింది. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల అనుబంధం ఇంతటితో ముగిసింది. ఇన్నేళ్లు నాకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, సహచరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ ఆయన 'ఎక్స్' వేదికగా తన రాజీనామాను ప్రకటించారు.
రాజీనామా తర్వాత మిలింద్ తన కుటుంబసభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ధి వినాయకుని దేవాలయాన్ని సందర్శించారు.
మరోవైపు యాత్ర ప్రారంభానికి కొద్ది గంటల ముందు మిలింద్ రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. మిలింద్ రాజీనామా సమయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పలుపురు సీనియర్ నేతలు ఆయన రాజీనాామాపై స్పందించారు. "ఒక మిలింద్ దేవ్‌రా వెళ్ళిపోతే, మా పార్టీని, భావజాలాన్ని నమ్మే లక్షలాది మంది మిలింద్‌లు ఇంకా ఇక్కడే ఉన్నారు. మిలింద్ కాంగ్రెస్‌ను వీడటాన్ని ఓ హెడ్‌లైన్‌గా ప్రధాని మోదీ చిత్రీకరింలాలనుకున్నారు. అయితే దీని ప్రభావం మాపై ఉండదని నా అభిప్రాయం" అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కూడా ఈ అంశంపై స్పందించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర' నుంచి అందరి దృష్టిని మళ్లించడానికి బీజేపీ వేసిన పన్నాగమంటూ పటోలే ఆరోపించారు. అంతే కాకుండా మిలింద్‌ను రెండు సార్లు ఓడిపోయిన అభ్యర్థి అంటూ ఆయనపై వ్యంగ్రాస్త్రాలు సంధించారు.
పొత్తులో సీటు పోతుందనే!
కాంగ్రెస్ సీనియర్ నేత మురళీ దేవ్‌రా కుమారుడే మిలింద్. పార్టీలో శక్తిమంతమైన యువ నాయకుల్లో ఒకరైన ఆయన, దక్షిణ ముంబయి లోక్‌సభ స్థానం నుంచి 2004, 2009లో విజయాన్ని సాధించారు. అంతే కాకుండా 2012లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే 2014, 2019లో మాత్రం శివసేన నేత అరవింద్ సావంత్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో మిలింద్ పార్టీని వీడతారంటూ కొన్నాళ్ల నుంచి ఊహాగానాలు వినిపించాయి. భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో చర్చిస్తున్నట్లు తెలిపిన ఆయన తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్-శివసేన (ఉద్ధవ్ వర్గం) కూటమిలో భాగంగా దక్షిణ ముంబయి సీటుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్ధవ్ వర్గానికి సీటు కేటాయిస్తే టికెట్ దక్కడం కష్టమే అంటూ భయాలు మిలింద్‌కున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి ఏక్‌నాథ్ శిందే వర్గంలో చేరారనే ప్రచారం జరుగుతోంది.
2024 ఎన్నికలే టార్గెట్.. 'భారత్ జోడో యాత్ర-2.0'కు రాహుల్ రెడీ.. ఆ తేదీ నుంచే స్టార్ట్!
భారత్ జోడో న్యాయ్ యాత్రకు మణిపుర్ సర్కార్ షరతులు