కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు అన్నదాతలు. వీరిలో కొందరు యువకులు, మధ్యవయసున్నవారు, ముసలివారు ఉన్నారు. ఎంతో మందికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న లెక్క చేయడం లేదు. కుటుంబాన్ని వదిలి రెండు వారాలు కావస్తోన్న మొక్కవోని స్థైర్యంతో కదం తొక్కుతున్నారు. వారిలో కొందరి పోరాట గాథలు ఇవి
"మాది పంజాబ్లో ఓ చిన్న గ్రామం. నా వయసు 71 ఏళ్లు. ఈ మధ్యనే మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. శారీరకంగా కొంత ఇబ్బందిగా ఉంది. కానీ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాడానికి నాకు కావాల్సినంత బలం వస్తోంది. నాకు గుర్తున్న మేరకు తరతరాల నుంచి జీవనోపాధి కోసం వ్యవసాయం మీదే ఆధారపడ్డాం. నా కుమారులు కూడా రైతులు. నేను మా పూర్వీకుల గౌరవం నా పిల్లల హక్కుల కోసం పోరాడటానికి వచ్చాను. 'నాన్న మీరు ఈ పోరాటంలో గెలిచిన తర్వాతే ఇంటికి రండి' అని నా కుమారుడు నాతో అన్నాడు. ఆ మాటలే నాకు కొత్త శక్తిని ఇస్తున్నాయి."
-గురుదేవ్ సింగ్
"రెండేళ్లలో గుండె, మూత్రపిండాలకు సంబంధించి మూడు పెద్ద శస్త్రచికిత్సలు జరిగాయి. కానీ వీటి కంటే నాకు మా రైతుల ఆందోళనను కేంద్రం పట్టించుకోక పోవడమే పెద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది. ఈ మధ్యనే నాకు మనవరాలు పుట్టింది. తనని చూడాలని ఉంది. కానీ ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించడం లేదు. నేను నా చిట్టి తల్లి భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను. ఈ క్రమంలో నేను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ పోరులో గెలిచాక నా మనవరాలికి నా ముఖం చూపిస్తాను. తన తాత రైతుల కోసం పోరాడినట్లు ఆమె తెలుసుకోవాలి."
-సజ్జన్ సింగ్