బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య జెనీలియాకు చెందిన కంపెనీకి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎమ్ఐడీసీ) అక్రమంగా భూములు కేటాయించిందని భాజపా నేతలు ఆరోపించారు. రితేశ్ కంపెనీ దేశ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌కు.. లాతూర్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్, పంఢరపుర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు రూ.120 కోట్ల రుణాన్ని అక్రమంగా ఇచ్చాయని అన్నారు. రితేశ్‌కు చెందిన కంపెనీలో అవకతవకలు జరిగాయని.. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని భాజపా లాతూర్ జిల్లా అధ్యక్షుడు గుర్నాథ్ మాగే, లాతూర్ పట్టణ అధ్యక్షుడు ప్రదీప్ మోరే డిమాండ్ చేశారు.
పరిశ్రమల ఏర్పాటు కోసం భూమి కేటాయించాలని 16 కంపెనీలు చేసిన అభ్యర్థనలను రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంచి రితేశ్‌కు చెందిన దేశ్ ఆగ్రో కంపెనీకి ఎమ్డీసీ అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. సంస్థ ఏర్పాటైన 22 రోజుల్లోనే ఎమ్ఐడీసీ.. దేశ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌కు భూములను కేటాయించిందని తెలిపారు. ఈ క్రమంలో ఎమ్ఐడీసీ భూములు కేటాయింపు, బ్యాంకులు రుణాలు ఇవ్వడం.. ఈ రెండు కేసులపైనా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
దేశ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ 2021 మార్చి 23న ప్రారంభమైంది. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య, నటి జెనీలియాకు ఈ కంపెనీలో సమాన భాగస్వామ్యం ఉంది. ఈ కంపెనీ.. లాతుర్‌లో పరిశ్రమ కోసం భూముల కేటాయించాలని 2021 ఏప్రిల్ 5న ఎమ్ఐడీసీకి దరఖాస్తు చేసుకుంది. 2021 ఏప్రిల్ 15న 2,52,726 చదరపు మీటర్ల భూమిని మంజూరు చేసింది ఎమ్ఐడీసీ. కంపెనీ షేర్ క్యాపిటల్ రూ.7.50 కోట్లు మాత్రమే ఉండగా.. ఎంఐడీసీకి రూ.15 కోట్లకు పైగా చెల్లించింది కంపెనీ.