తమిళనాడు మధురైలో కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా విమానంలో పెళ్లి చేసుకున్న ఘటనపై పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. కొవిడ్ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలపై విచారణ చేపట్టి, విమాన సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాల్సిందిగా స్పైస్ జెట్‌కు షోకాజ్ నోటిసులు జారీ చేసింది. పెళ్లి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు మధురై ఎస్పీ సుజిత్ కుమార్ తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
తమిళనాడు మధురైకి చెందిన రాకేశ్, దీక్షణ ఆదివారం ఉదయం స్పైస్ జెట్ విమానాన్ని అద్దెకు తీసుకుని ఆ విమానంలోనే వివాహం చేసుకున్నారు. పెళ్లి తంతు మొత్తం వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అది కాస్త వైరల్‌గా మారింది. కర్ఫ్యూ కారణంగా 50మంది మాత్రమే పెళ్లికి హాజరయ్యేందుకు అనుమతి ఉండగా... ఈ పెళ్లికి 161 మంది హాజరయ్యారు. వచ్చిన వారు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.